Share News

Hyderabad: టమాట కిలో 100 ..

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:49 AM

కూకట్‌పల్లికి చెందిన నవనీత్‌ రావు గురువారం కూరగాయల కోసం సమీపంలోని రైతు బజార్‌కు వెళ్లాడు! టమాటల రేటు తెలుసుకొని షాక్‌ అయ్యాడు. కిలో రూ.70 అని చెప్పారు! దూరంగా మంచి క్వాలిటీతో కనిపించడంతో అక్కడికి వెళ్లి అడిగితే కిలో రూ.80 అని చెప్పారు!

Hyderabad: టమాట కిలో 100 ..

  • ఉల్లిగడ్డ రూ.100కు రెండున్నర కిలోలు

  • బీరకాయ, క్యాప్సికమ్‌ రూ.80.. పచ్చిమిర్చీ ప్రియమే

  • అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో పడిపోయిన దిగుబడి

  • కొత్త పంట వచ్చే జూలై చివరిదాకా ధరాఘాతం తప్పదు

  • టిఫిన్‌, మీల్స్‌ రేట్లపై ప్రభావం.. ధరలు పెంచుతున్న హోటళ్లు

హైదరాబాద్‌ సిటీ/ ఎర్రగడ్డ/చార్మినార్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లికి చెందిన నవనీత్‌ రావు గురువారం కూరగాయల కోసం సమీపంలోని రైతు బజార్‌కు వెళ్లాడు! టమాటల రేటు తెలుసుకొని షాక్‌ అయ్యాడు. కిలో రూ.70 అని చెప్పారు! దూరంగా మంచి క్వాలిటీతో కనిపించడంతో అక్కడికి వెళ్లి అడిగితే కిలో రూ.80 అని చెప్పారు! క్యాప్సికమ్‌, బీరకాయలూ కిలో 80 రూపాయలే! రూ.500 తీసుకొని పది రకాల కూరగాయలు తీసుకుందామని వెళితే చేతిబస్తాలో సగమే వచ్చాయి! అన్నీ అరకిలో, పావుకిలో చొప్పున కొని ఉసూరుమంటూ ఇంటికెళ్లాడు! ఎర్రగడ్డ, మెహదీపట్నం రైతు బజార్లోనూ ఇవే ధరలు! ఉల్లిగడ్డ రూ.100కు రెండున్నర కిలోలు! పచ్చిమిర్చి రూ.60, కాకర రూ.65! సూపర్‌ మార్కెట్లలో టమాటనైతే రూ.100-110.. పచ్చిమిర్చి అయితే రూ.100-120.. ఉల్లిగడ్డ రూ.50! తాజా బీరకాయలు, క్యాప్సికమ్‌, పచ్చిమిర్చి, క్యారెట్‌ను సంచీలో వేసుకోవాలని మనసుకు అనిపించినా జేబు సహకరించనంటోంది! హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.


వారం క్రితం కిలో రూ40గా ఉంటే మిగతా కూరగాయలు దాదాపు రూ.40-50లోపే దొరికాయి! వారం క్రితం ధరలతో పోల్చితే రెండున్నర రెట్లు పెరిగాయి. ఎప్పుడూ అగ్వకు దొరికే వంకాయ కూడా రూ.50కి చేరువై బాబోయ్‌ అనిపిస్తోంది! ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సరిపడా కూరగాయలు కొనలేకపోతున్నారు. కొన్నాళ్లు ఈ కూర ‘గాయాల’ బెడద తప్పేందుకు అటకమీదుంచిన కొత్త పచ్చళ్ల జాడీలను దించుతున్నారు. కొందరేమో వండటంలోనే జాగ్రత్తపడుతున్నారు. ఉదయం వండిన కూరలతోనే రాత్రి భోజనం కానిచ్చేస్తున్నారు! వారం లోపే కూరగాయల ధరలు ఈ స్థాయిలో ఎందుకు పెరిగినట్లు? అంటే.. ఇటీవల కురిసన అకాలవర్షాల కారణంగా చేలల్లోని కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఫలితంగా దిగుబడి తగ్గిందని, ఆ ప్రభావంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.


ఏపీలోని మదనపల్లి నుంచి నగరానికి వచ్చే టమాటా దిగుమతి 60 శాతం తగ్గిపోయిందని రేట్లు అనివార్యంగా పెరిగాయని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. కాగా కూరగాయల ధరల పెరుగుల ప్రభావం హోటళ్లపై పడింది. వివిధ టిఫిన్‌ రేట్లను రూ.5 చొప్పున.. మీల్స్‌ను రూ.10 పెంచినట్లు తెలుస్తోంది. పానీపూరీ బండీల్లో, రెస్టారెంట్లలో నాన్‌వెజ్‌ ఫుడ్‌కు అదనంగా ఉల్లి ముక్కలు అడిగితే ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మళ్లీ కొత్త పంటలు వచ్చేదాకా అంటే.. జూలై చివరి వరకు లేదంటే ఆగస్టు రెండో వారం వరకు కూరగాయల ధరలు ఇదే స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు.


21.jpg

వర్షాల ప్రభావంతోనే

అకాల వర్షాలతో దిగుబడి తగ్గడం, రవాణా చార్జీలు పెరగడమూ కూరగాయల ధరల పెరుగదలకు కారణం! కొత్త పంటలు వేసే సీజన్‌ కావడంతో రైతుబజార్‌కు వచ్చే కూరగాయల దిగుమతి తగ్గింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను తెప్పించి పేదలను ఆదుకోవాలి.

-మహ్మద్‌ షబ్బీర్‌, ఏతేబార్‌ చౌక్‌


22.jpg

ధరలను నియంత్రించాలి

కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. తక్కువకు కూరగాయలు అందించేలా కృషి చేయాలి.

-రజిని, సనత్‌నగర్‌


23.jpg

దిగుబడి తగ్గడంతోనే

ప్రస్తుతం గ్రామాల్లో కూరగాయల దిగుమతి బాగా పడిపోయింది. ఎండాకాలంలో వేసిన పంటలు చివరి దశకొచ్చాయి. గతంలో ఎర్రగడ్డ రైతుజజార్‌కు 1400 నుంచి 1500 క్వింటాళ్ల వరకు కూరగాయలు దిగుమతి అయ్యేవి. ఇప్పుడు 1100 నుంచి 1200 క్వింటాళ్ల వరకే వస్తున్నాయి. జూలై నెలాఖరు వరకు కూరగాయల ధరలు సాధారణ స్థితికి వస్తాయి.

- రమేశ్‌. ఎస్టేట్‌ అధికారి, ఎర్రగడ్డ రైతుబజార్‌

Updated Date - Jun 21 , 2024 | 04:49 AM