kaleshwaram : బ్యారేజీలపై అబద్ధాలు
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:38 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్‌కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా?
విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు
కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలకాంశాలు
గతంలో చక్రం తిప్పినవారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో..
వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి!
మంత్రి ఆదేశించినా సమగ్ర సమాచారం ఇచ్చేందుకు నో
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్‌కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా? కమిషన్ ఏ సమాచారం కోరినా.. అందరూ కూడబలుక్కొని ఒకే రకంగా చెబుతూ వాస్తవాలు వెల్లడి కాకుండా చేస్తున్నారా? అంటే.. అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా పీసీ ఘోష్ కమిషన్ గుర్తించిందని, అందుకే సమగ్ర సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కోరిందని తెలిసింది. కానీ, అఫిడవిట్లలో కూడా కీలక అంశాలు లేవని కమిషన్ గుర్తించినట్లు సమాచారం.
విచారణ కమిషన్‌కు సమగ్ర సమాచారం అందించాలని, పూర్తిస్థాయిలో సహకరించాలని సీఎం రేవంత్‌తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించినా వారు తమ తీరు మార్చుకోలేదని తెలుస్తోంది. వాస్తవాలు కమిషన్‌కు చేరకుండా అడ్డుకోవడమే కాకుండా.. సాక్ష్యాలు అందించే విషయంలోనూ కలిసికట్టుగా ఒకే విషయం చెప్పాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న వారంతా గత ప్రభుత్వంలో చక్రం తిప్పినవారేనని, కమిషన్‌ను బురిడీ కొట్టించేలా అధికారులకు వారే సూచనలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరి సూచన మేరకే అధికారులు ఇంతకుముందు..
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోపాటు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నిపుణుల బృందం విచారణ సమయంలో కూడా కూడబలుక్కొని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభ మైన నాటి నుంచే కీలక అధికారులు ప్రణాళిక ప్రకారం వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పనుల్లో దాదాపు 150 మంది దాకా అధికారులు పాలుపంచుకోగా.. అందులో 33 మంది క్రియాశీలంగా వ్యవహరించినట్లు సమాచారం.
బ్యారేజీల వైఫల్యానికి కారకులు వీరేనని, వాస్తవాలు వెలుగులోకి వస్తే తమ బండారం బయటపడుతుందనే వీరు కమిషన్ కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అధికారులు కూడబలుక్కొని తమకు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు గా జస్టిస్ ఘోష్ గతంలోనే గుర్తించి.. ఈ విషయమై ఉన్నతాధికారులను నిలదీసినట్లు సమాచారం. తమకు సమాచారం ఇవ్వరాదని వారు వాట్సా్‌పలో సమావేశాలు నిర్వహిస్తుంటే ఇక కమిషన్‌తో ఏం పని? అని ఆయన నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయం మంత్రి ఉత్తమ్ దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం.
కమిషన్ చైర్మన్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో సమావేశాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే శాఖను ప్రక్షాళన చేయకుండా, కీలక బాధ్యతల్లో ఉన్నవారిని తప్పించకుండా విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాల్లేవని అధికారులు అంటున్నారు.