Share News

KTR: రేవంత్‌పై చీటింగ్‌ కేసు పెట్టాలి

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:51 AM

రుణమాఫీ పేరిట రైతులను మోసగించిన సీఎం రేవంత్‌రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

KTR: రేవంత్‌పై చీటింగ్‌ కేసు పెట్టాలి

  • రుణమాఫీ పేరిట రైతులను మోసగించారు

  • 100% చేసినట్లు నిరూపించండి

  • రాజీనామా చేసి.. రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ పేరిట రైతులను మోసగించిన సీఎం రేవంత్‌రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.40వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేస్తామని రేవంత్‌ ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేసరికే ఆ మొత్తాన్ని రూ.31వేల కోట్లకు తగ్గించారు. ఇప్పుడు మాఫీ పేరిట రైతుల ఖాతాల్లో వేసింది రూ.17,934కోట్లు మాత్రమే. ఈ మాత్రానికే హరీశ్‌రావు రాజీనామా చేయాలని రంకెలు వేస్తున్నారు.


రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రైతులకు వందశాతం రుణ మాఫీ జరిగినట్లు నిరూపించాలి. సీఎం సొంత నియోజక వర్గంలో ఏదైనా గ్రామానికి మీడియాతో కలిసి వెళ్దాం. అక్కడ వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా.. నేను నా పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయ సన్యాసం చేస్తా’’ అని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీలో సవాలక్ష కొర్రీలు, ఆంక్షలు విధించి ఎక్కువ మందిని అనర్హులుగా నిర్ణయించారన్నారు.


సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే.. రేవంత్‌రెడ్డిని ప్రజలు ఫుట్‌బాల్‌ ఆడతారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బాక్రానంగల్‌ అంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడడం చూస్తే.. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. తమ పార్టీ నాయకులు నియోజకవర్గాల్లో పరిశీలించి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని, అందరికీ రుణమాఫీ చేయకుంటే కోర్టుకైనా వెళ్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.


కాగా, తమిళనాడులోని కీలక పార్టీలతోపాటు ఏపీలోని టీడీపీ, వైఎస్సార్‌సీపీ పని తీరుపై అధ్యయనం చేసి.. తమ పార్టీలో అవసరమైన మార్పులు చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. కాగా, ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీ అవార్డు అందుకున్న మాదాపూర్‌ సీసీఎస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యకు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - Aug 17 , 2024 | 04:51 AM