Medchal: రికవరీ బంధు!
ABN , Publish Date - Jul 12 , 2024 | 04:36 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్‌లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రైతుబంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం
మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు
జిల్లాలో 33 ఎకరాల భూమిలో 1981లోనే లే-అవుట్
అయినా గత ఐదేళ్లలో పథకం కింద రూ.17 లక్షలు లబ్ధి
ఫిర్యాదు రావడంతో రికవరీ
హైదరాబాద్, మేడ్చల్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్‌లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఘట్కేసర్ మండలం పోచారం గ్రామంలో మోత్కుపల్లి యాదగిరి రెడ్డి అనే వ్యక్తికి సర్వే నంబర్లు- 38, 39, 40 లో ఉన్న 30 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 1981లోనే లే అవుట్లుగా అమ్ముకున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని గత జూన్ నెల 29న ఘట్కేసర్ తహసీల్దారుకు ఆదేశాలు జారీచేశారు.
రైతుబంధు కింద తీసుకున్న రూ. 16.80 లక్షలను రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలుచేయాలని, అలాగే తహిసీల్దార్ లాగిన్‌లో ‘ఎల్‌ఎన్’ మాడ్యూల్ లో సదరు భూమిని వ్యవసాయ విభాగం నుంచి వ్యవసాయేతర విభాగానికి మార్చాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా ఈ ఉత్తర్తులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి.. రాష్ట్రమంతటా ఇదే పద్ధతిని అనుసరిస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ తరహా నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టంగా చెబుతున్నాయి.
సాగుచేయని భూములకు సుమారు 26 వేల కోట్లు
గత ప్రభుత్వం రైతుబంధు పథఽకం అమలుచేసే క్రమంలో ఎలాంటి షరతులు విధించలేదు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న భూములన్నింటికి రైతుబంధు నిధులు పంపిణీ చేసింది. మొత్తం 12 విడతల్లో కలిపి రూ. 80,458 కోట్ల నిధులు రైతుబంధు పథఽకంపై ఖర్చు చేసింది. ఇందులో సాగుకు యోగ్యంలేని భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న భూములు, రియలెస్టేట్ వెంచర్లకు రూ. 25,672 కోట్లు పంపిణీచేసినట్లు ఈ ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని వెల్లడించింది. అయినా ఈ సొమ్మును రికవరీచేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా వెల్లడించాయి.