Share News

Dubbak: పెరోల్‌కు ముందు రోజే మృతి.. చనిపోయిన ఆరేళ్లకు నిర్దోషి

ABN , Publish Date - Aug 05 , 2024 | 05:36 AM

తల్లి చనిపోయిన బాధలో ఉంటే.. కొడుకే హంతకుడంటూ పోలీసులు అరెస్టు చేశారు. నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) 161 ప్రకారం నేరాంగీకార పత్రం(కన్ఫెషన్‌) ఆధారంగా చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ట్రయల్‌ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

Dubbak: పెరోల్‌కు ముందు రోజే మృతి.. చనిపోయిన ఆరేళ్లకు నిర్దోషి

  • కన్న తల్లిని చంపాడంటూ కొడుకు అరెస్టు

  • యావజ్జీవ శిక్ష విధించిన ట్రయల్‌ కోర్టు

  • హైకోర్టులో అప్పీల్‌.. విచారణ ఆలస్యం

  • శనివారం తీర్పులో నిర్దోషిగా పోశయ్య

  • స్వీయ నేరాంగీకారంతో శిక్షించలేం: హైకోర్టు

దుబ్బాక, ఆగస్టు 4: తల్లి చనిపోయిన బాధలో ఉంటే.. కొడుకే హంతకుడంటూ పోలీసులు అరెస్టు చేశారు. నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) 161 ప్రకారం నేరాంగీకార పత్రం(కన్ఫెషన్‌) ఆధారంగా చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ట్రయల్‌ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. పెరోల్‌తో స్వేచ్ఛాగాలులు పీలుద్దామనుకున్న ఆ బాధితుడి గుండె.. సరిగ్గా బయటకు రావడానికి ఒక్క రోజు ముందు ఆగిపోయింది. ఆయన చనిపోయిన ఆరేళ్ల తర్వాత.. హైకోర్టు అతణ్ని నిర్దోషి అని తేల్చింది. హృదయాన్ని కలిచివేసే ఈ కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా.. దుబ్బాక మండలం, పెద్దగుండవెళ్లికి చెందిన గుండెళ్లి ఎల్లవ్వ(80) 2013 ఫిబ్రవరి 1న తన ఇంటి పక్కనే ఉన్న సీతాఫలం చెట్టుకు టవల్‌తో ఉరేసుకుని చనిపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఎల్లవ్వ మృతిని హత్యగా భావించారు.


ఆమె కుమారుడు పోశయ్య(అప్పటి వయసు 58)పై అనుమానంతో అరెస్టు చేశారు. ఎల్లవ్వ అనారోగ్యంతో బాధపడడం చూడలేక పోశయ్య ఆమెను టవల్‌తో గొంతు నులిమి, హత్య చేసి, సీతాఫలం చెట్టుకు వేలాడదీశాడని పోలీసులు అభియోగాలు మోపారు. 2015 జనవరి 12న సిద్దిపేట జిల్లా ఆరో అదనపు సెషన్స్‌ కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోశయ్య దాన్ని సవాల్‌ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆలస్యం కావడంతో.. 2018లో పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. పెరోల్‌ రావడంతో.. 2018 ఆగస్టు 15న విడుదలవ్వాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందే చర్లపల్లి జైలులో మృతిచెందాడు.


గుండెపోటు కారణంగా అతను మృతిచెందినట్లు జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆగస్టు 16న పోశయ్యకు అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. పోశయ్య అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టు శనివారం తుది తీర్పునిచ్చింది. పోశయ్యే హత్యచేశాడనడానికి సరైన ఆధారాలను పోలీసులు సమర్పించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం నిందితుడు పోలీసుల ఎదుట సీఆర్‌పీసీ 161 కింద ఇచ్చిన స్టేట్‌మెంట్‌, నేరాంగీకార పత్రం నేర నిర్ధారణకు సరిపోదని తేల్చిచెప్పింది.


పోస్టుమార్టం నివేదిక కూడా అది హత్యా? ఆత్మహత్యా? అన్నదాన్ని తేల్చలేదని, రెండిటిలో ఏదైనా కావొచ్చనే సంశయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేసింది. సాక్ష్యాధారాలు లేనందున పోశయ్యను నిర్దోషిగా ప్రకటిస్తూ.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపట్ల పోశయ్య కుమారులు జయరాజ్‌, దేవయ్య హర్షం వ్యక్తం చేశారు. అయితే.. నిర్దోషి అయిన పోశయ్య ఇప్పుడు తమ మధ్యలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Aug 05 , 2024 | 05:36 AM