Manchu Manoj: విష్ణుతో నాకు ప్రాణహాని
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:56 AM
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మోహన్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు
సంతకం తీసుకొని.. పోలీసులకు తప్పుడు లేఖ
రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
పహాడీషరీఫ్ స్టేషన్‌లో ఏడు పేజీల లేఖ అందజేత
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మోహన్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఏడు పేజీల లేఖను పహాడీషరీఫ్ పోలీసులకు అందజేశారు. కుటుంబంలో గొడవలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరంగా రాసి, కొన్ని సీసీటీవీ ఫుటేజీలను, ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులకు సమర్పించడంతోపాటు ఫిర్యాదు లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో.. మోహన్‌బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నట్లు, విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మనోజ్ తెలిపారు. దాంతో ఈ ఏడాది సెప్టెంబరు 11న యూనివర్సిటీ బాధ్యతలు చూస్తున్న వినయ్ మహేశ్వరిని ఆ అక్రమాలపై నిలదీశానని పేర్కొన్నారు. అయితే ఆయన తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని, వివిధ ఫోన్ నంబర్‌ల నుంచి ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. ‘‘అనంతరం సెప్టెంబరు 13న మా నాన్న మోహన్‌బాబు ఫోన్ నుంచి విష్ణు, వినయ్ తప్పుడు మెసేజ్ పంపారు. ఆస్తికోసం గొడవ పెట్టుకుంటున్నావా? అంటూ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మెసేజ్ చేసి, నన్ను దోషిలా నిలబెట్టారు.’’ అని లేఖలో మనోజ్ వివరించారు.
అమ్మను మాయ చేశారు..
‘‘నేను ఇంట్లో లేని సమయంలో మా అమ్మ వద్దకు వచ్చిన విష్ణు, అతని మనుషులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. వారికి అనుకూలంగా లేఖ రాశారు. ఆ తర్వాత అమ్మను మాయచేసి ఆ లేఖ అమ్మ రాసిందని పోలీసులకు పంపించి మీడియాకు తెలిసేలా చేశారు. నన్ను అందరి దృష్టిలో చెడ్డవాణ్ని చేయాలని ప్రయత్నించారు.’’ అని లేఖలో మనోజ్ తెలిపారు. డిసెంబరు 14న తమ తల్లి పుట్టినరోజును ఆసరాగా చేసుకొని తన కుటుంబసభ్యులకు హాని చేసే ప్రయత్నం జరిగిందని మనోజ్ ఆరోపించారు. అమ్మ పుట్టినరోజుకు కేక్ ఇచ్చే నెపంతో విష్ణుతోపాటు అతడి అనుచరులు రాజ్ కందూరు, కిరణ్, విజయ్ రెడ్డితోపాటు కొంతమంది బౌన్సర్‌లు ఇంటికి వచ్చారని, ఈ సమయంలో వారు తన జనరేటర్‌లో పంచదార కలిపిన డీజిల్ పోశారని తెలిపారు.
దాంతో కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతోపాటు జనరేటర్ నుంచి నిప్పు రవ్వలు ఎగిరిపడ్డాయని చెప్పారు. నిప్పురవ్వల కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటే.. ఇంట్లో ఉన్న తన 9 నెలల పాప, వృద్ధురాలైన తల్లి, అంకుల్, ఆంటీల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని మనోజ్ తెలిపారు. నిత్యం ఏదో ఒక ఇబ్బంది సృష్టిస్తున్నారని, కరెంట్ కట్ చేస్తూ, నీటి సరఫరా నిలిపివేస్తూ తన కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసెంబరు 9న డీజీపీని కలిసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి రానివ్వకుంటే గేటు ధ్వంసం చేసి లోపలికి వెళ్లానన్నారు. ఆ సమయంలో విష్ణు కత్తులు, గన్నులు తేండిరా అంటూ భయబ్రాంతులకు గురిచేశారని, అందుకు సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఉందని తెలిపారు.