తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:21 AM
అబూజ్‌మఢ్‌లో కేంద్ర బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను సేఫ్‌జోన్‌గా మార్చుకుంటున్నారా?
చర్ల మీదుగా రాష్ట్రంలోకి కేంద్ర బలగాలు
2 వేల మంది జవాన్ల కూంబింగ్
సమాచారం లేదంటున్న స్థానిక పోలీసులు
అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
చర్ల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అబూజ్‌మఢ్‌లో కేంద్ర బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను సేఫ్‌జోన్‌గా మార్చుకుంటున్నారా? 2026కల్లా ఛత్తీ్‌సగఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్రం హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్‌కౌంటర్లు పెరగడం, నక్సల్స్ వైపు నష్టం తీవ్రంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? అందుకే.. తెలంగాణ సరిహద్దుల్లో.. ఛత్తీ్‌సగఢ్‌లో ఉన్న కొండపల్లి, జీడిపల్లి సీఆర్‌పీఎఫ్ క్యాంపులపై అడపాదడపా నక్సల్స్ దాడులు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు ఔననే సమాధానం చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్ర బలగాలు ఇప్పుడు తెలంగాణ అడవులను జల్లెడపడుతున్నాయి.
క్రాస్‌బార్డర్ ఆపరేషన్?
సాధారణంగా రాష్ట్ర పోలీసులకు సరిహద్దుల నిబంధన ఉంటుంది. అయితే.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ‘క్రాస్ బార్డర్ ఆపరేషన్ల’ను నిర్వహిస్తుంటాయి. గతంలో తెలంగాణ పోలీసులు ఛత్తీ్‌సగఢ్‌లో ఆపరేషన్లు నిర్వహించిన దాఖలాలున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర బలగాలతోపాటు.. ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ఫైటర్స్, డీఆర్జఈ, ఎస్‌టీఎఫ్, మహిళా కమాండోలు సుమారు 2 వేల మంది సోమవారం ఉదయం చర్ల మీదుగా తెలంగాణ అడవుల్లోకి ప్రవేశించారు. ఈ బలగాల రాక సాధారణం కాదని, ప్రత్యేక ఆపరేషన్ కోసమే సరిహద్దులను దాటారని ఛత్తీ్‌సగఢ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై చర్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజువర్మను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. ‘‘కేంద్ర బలగాల రాకపై మాకు ఎలాంటి సమాచారం లేదు’’ అని చెప్పారు. వేల మంది జవాన్లు ఒకేసారి తెలంగాణలోకి రావడంతో.. స్థానికులు ఏం జరుగుతోందో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు.
యువ ఐపీఎ్‌సల బదిలీ అందుకేనా?
తెలంగాణలో నక్సల్స్ కదలికలపై రాష్ట్ర పోలీసులకు కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉన్నఫళంగా యువ ఐపీఎ్‌సలను సరిహద్దు జిల్లాలు, గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాలకు బదిలీ చేసినట్లు సమాచారం. కమాండర్లుగా వీరంతా గ్రేహౌండ్స్‌లో కఠోర శిక్షణ పొందినట్లు స్పష్టమవుతోంది.