Share News

Hyderabad: సామాన్యులపై భారం పడకుండా భూముల ధరల సవరణ..

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:12 AM

మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రస్తుత మార్కెట్‌ విలువలకు అనుగుణంగా రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు.

Hyderabad: సామాన్యులపై భారం పడకుండా భూముల ధరల సవరణ..

  • ఆధునిక వసతులతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

  • పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు: పొంగులేటి

హైదరాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రస్తుత మార్కెట్‌ విలువలకు అనుగుణంగా రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. స్టాంపులు, రిజిరేస్టషన్ల శాఖపై సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌సహా రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్‌ ధరలు గణనీయంగా పెరిగాయన్నారు. బహిరంగ మార్కెట్‌ విలువలకు, రిజిస్ట్రేషన్‌ విలువలకు భారీగా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్ర్తీయ పద్థతిలో భూముల ధరలను సవరించాలని సూచించారు.


గత ప్రభుత్వంలో ఎలాంటి కసరత్తు చేయకుండానే భూముల ధరలను పెంచారని ఆ పరిస్థితి పునరావృతం కాకూడదని సూచించారు. స్టాంపులు, రిజిరేస్టషన్ల శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల కోసం అత్యాధునిక వసతులతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పనితీరు ఆధారంగా ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా చేపడతామని హామీ ఇచ్చారు.

Updated Date - Jul 06 , 2024 | 04:12 AM