Share News

Rain Effect: పెద్దపల్లిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..

ABN , Publish Date - Sep 02 , 2024 | 08:22 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వరదలతో ముంచెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 9మందికి పైగా వరదల్లో చిక్కుకుని మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అయితే రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Rain Effect: పెద్దపల్లిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వరదలతో ముంచెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 9మందికి పైగా వరదల్లో చిక్కుకుని మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అయితే రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మల్యాల- కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగులో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుణ్ని కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన బిల్ కలెక్టర్ పవన్‌గా గుర్తించారు. భారీ వర్షాలకు వాగు దాటే సమయంలో అతను కొట్టుకుపోగా.. కుంటుబసభ్యులు సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. వాగులో గ్రామస్థులు, రెస్క్యూ టీం గాలించగా పవన్ మృతదేహం దొరికింది. దీంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరోవైపు మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి సమీపం రాళ్లవాగు దాటేందుకు డీసీఎం వ్యాన్ డ్రైవర్ ప్రయత్నించారు. అయితే వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో వ్యాన్ వాగులో కొట్టుకుపోయింది. ఘటన జరిగిన సమయంలో అందులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. తక్షణమే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నలుగురిని కాపాడాయి. మరో వ్యక్తి గల్లంతు కాగా.. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై మున్నేటి వరదలో 9మంది చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షితంగా కాపాడారు. ముందుగా 9మంది చిక్కుకున్నట్లు తెలియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితిని సమీక్షించారు. సహాయక బృందాలను రప్పించి రాత్రి సమయంలో అతి కష్టం మీద వారిని వరద ముప్పు నుంచి రక్షించారు. సురక్షిత ప్రాంతానికి 9మందిని తీసుకురావడంతో బాధిత కుటంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఖమ్మం రాజీవ్ గృహకల్పలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాత్రంతా విస్తృతంగా పర్యటించారు. గృహకల్పలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారందరినీ పడవల సహాయంతో బయటకు తీసుకువస్తున్నారు. మరోవైపు మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గత రాత్రి పర్యటించారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను మంత్రి స్వయంగా పరిశీలించారు.

Updated Date - Sep 02 , 2024 | 08:22 AM