వైభవంగా ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
ABN , Publish Date - Jan 20 , 2024 | 12:54 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవోత్సవం ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు.

యాదగిరిగుట్ట, జనవరి 19: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవోత్సవం ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. ప్రభాతవేళ సుప్రభాతంతో స్వయంభువులను మేల్కొలిపిన ఆచార్యులు వేదమంత్ర పఠనాలతో పంచామృతాలతో అభిషేకించి, తులసీదళాలు, కుంకుమతో అర్చించారు. ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణం సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, యాగశాలలో చండీ హోమం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. సాయంత్రం వేళ ప్రధానాలయంలో కొలువుదీరిన ఆండా ళ్ అమ్మవారిని పట్టువసా్త్రలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి సేవలో తీర్చిదిద్దారు. అమ్మవారి సేవను ఆలయ తిరువీధుల్లో ఊరేగించిన అర్చకస్వాములు ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో ఊయలలో అధిష్టింపజేశారు. అర్చకుల వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు, మహిళా భక్తుల మంగళ నీరాజనాల నడుమ ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.19,46,626 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.