Police: మీరు పండుగకు ఊరెళ్తున్నారా.. అయితే మాకు సమాచారం ఇవ్వండి..
ABN , Publish Date - Jan 11 , 2024 | 01:16 PM
అసలే పండుగ.. ఆ పై వారాంతాలు.. సంక్రాంతికి నాలుగు రోజుల ముందే నగరవాసులు ఊరెళ్లిపోతున్నారు. పెట్టే బేడ సర్దేసి ఇంటికి తాళం వేస్తున్నారు. ఇదే సమయంలో దొంగలు చొరబడతారని మరిచిపోతున్నారు.
- బంజారాహిల్స్ పోలీసుల సూచన
- సంక్రాంతికి స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి
బంజారాహిల్స్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): అసలే పండుగ.. ఆ పై వారాంతాలు.. సంక్రాంతికి నాలుగు రోజుల ముందే నగరవాసులు ఊరెళ్లిపోతున్నారు. పెట్టే బేడ సర్దేసి ఇంటికి తాళం వేస్తున్నారు. ఇదే సమయంలో దొంగలు చొరబడతారని మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఊరెళ్లే వారు తమకు సమాచారం ఇవ్వాలని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కట్టా హరిప్రసాద్(Jubilee Hills ACP Katta Hariprasad) సూచించారు. పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. ప్రతీ నిత్యం చోరీలు జరిగే కొన్నిప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి గస్తీని ముమ్మరం చేస్తున్నామని, సిబ్బందికి అదనపు బాధ్యతలను అప్పగించామని తెలిపారు. సెక్టారు వారీగా ఎస్సైలను అప్రమత్తం చేయడంతో క్రైం టీం బలగాలు నిరంతం గస్తీ తిరుగుతాయని, గంటకోసారి పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
ఈ జాగ్రత్తలు పాటించండి...
- ఊరెళ్లే వారు ఠాణాలో తమ పూర్తి వివరాలను అందించాలి. అలా ఇచ్చివెళ్లే వారి ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెడతాం.
- ఇంట్లో ఎలాంటి విలువైన ఆభరణాలు విడిచి వెళ్లరాదు. ఒకవేళ ఉంటే బ్యాంక్ లాకర్‌లో పెట్టి వెళ్లడమో లేదంటే తమ వెంట తీసుకువెళ్లడమో చేయాలి.
- ఇంటి యజమానుల చుట్టుపక్కల వారికి చెప్పి వెళ్లడం మంచిది. వారు కూడా కొంత దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.
- సీసీ కెమెరాలు ఉంటే అవి పనిచేస్తున్నాయా లేదా అనేది సరిచూసుకోవాలి. లేని వారు ఏర్పాటు చేసుకుంటే మేలు.
- ద్విచక్ర వాహనాలు ఉంటే ఇంటి లోపల పెట్టుకోవాలి.
- ఇంటి లోపల విద్యుత్ సరఫరాను నిలిపేసి వెళ్లాలి. షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలను నివారించవచ్చు.
- వీలైతే ఇంటి లోపలగాని, బయటగాని సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ దొంగతనం జరిగినా నిందితులను పట్టుకునే అవకాశాలుంటాయి.
- ఎవరైనా దొంగలను గుర్తిస్తే వెంటనే ఠాణాలో సమాచారం ఇవ్వవచ్చు. ఏ ఇబ్బంది ఎదురైనా 100కు లేదా స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.