University Development: ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు 500 కోట్లు ..
ABN , Publish Date - Jul 26 , 2024 | 04:56 AM
రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులను చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
హైదరాబాద్, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులను చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మండలానికి మూడు చొప్పున అంతర్జాతీయ స్థాయిలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.500కోట్లను కేటాయించారు. అలాగే... రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రూ.500కోట్ల నిధులను కేటాయించారు.
ఇందులో మహిళా యూనివర్సిటీకి రూ. 100కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కోసం రూ. 100కోట్లను కేటాయించారు. రాష్ట్రంలోని మిగతా వర్సిటీలకు ప్రగతి పద్దు కింద రూ.300 కోట్లను కేటాయించారు. సాధారణంగా ప్రతీ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో యూనివర్సిటీల నిర్వహణ, జీతభత్యాలకు నిధులను కేటాయిస్తుంటారు. ఈసారి వర్సిటీల అభివృద్ధికి కూడా నిధులను కేటాయించడం విశేషం. అదేవిధంగా... ప్రభుత్వ డిగ్రీ కాలేజీల భవనాల కోసం రూ.5.3కోట్లు, న్యూ ఇండియా లిటరసీ ప్రొగ్రాంకు రూ.7.01 కోట్లు, స్టేట్‌బుక్స్‌కు రూ. 18.29 కోట్లు, పాఠ్య పుస్తకాల పంపిణీకి కోసం రూ. 46.29 కోట్లను కేటాయించారు.