Share News

317 జీవో సమస్యల పరిష్కారానికి సర్కారు పచ్చజెండా

ABN , Publish Date - Dec 01 , 2024 | 04:25 AM

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భార్యాభర్తలు (స్పౌజ్‌), మెడికల్‌ గ్రౌండు, పరస్పర (మ్యుచువల్‌) బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

317 జీవో సమస్యల పరిష్కారానికి సర్కారు పచ్చజెండా

  • దంపతులు, ఆరోగ్య కారణాలు, పరస్పర బదిలీలకు ఓకే

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భార్యాభర్తలు (స్పౌజ్‌), మెడికల్‌ గ్రౌండు, పరస్పర (మ్యుచువల్‌) బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. 317 జీవోపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసుల మేరకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం 243, 244, 245 నంబర్లతో మూడు జీవోలను జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఖాళీలు ఉంటనే ఈ కేడర్‌ బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ బదిలీల సందర్భంగా ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు ఉద్యోగులను సర్దుబాటు చేసే ఉద్దేశంతో 2021 డిసెంబరు 6న అప్పటి ప్రభుత్వం జీవో నంబర్‌ 317ను జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా దాదాపు 30 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. దీంతో తాము స్థానికతను కోల్పోయామని, సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాకు వెళ్లాల్సి వచ్చిందని, భార్యాభర్తల (స్పౌజ్‌) కేసులను పరిగణనలోకి తీసుకోలేదంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. స్పందించిన ప్రభుత్వం భార్యాభర్తల కేసులు, పరస్పర బదిలీలకు సంబంధించి సడలింపులిచ్చింది. కానీ... భార్యాభర్తల కేసులకు సంబంధించి 19 జిల్లాల్లో పూర్తి స్థాయిలో బదిలీలు చేపట్టగా 13 జిల్లాల్లో స్కూల్‌ అసిస్టెంట్ల వరకే బదిలీలు చేపట్టారు. ఈ 13 జిల్లాల్లో పూర్తి స్థాయి బదిలీలు జరగలేదు. భార్యాభర్తల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా బదిలీలు చేపట్టాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.


స్థానిక జిల్లా కేడర్‌ అంశాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 24న క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ... ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి పలు వినతులు స్వీకరించి, వారితో సమావేశమై వాదనలు విన్నది. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి, వారి వివరణలు తీసుకుంది. అనంతరం ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఒక ఉద్యోగిని స్థానిక జిల్లాకు బదిలీ చేసే సందర్భంలో అక్కడ స్పష్టమైన ఖాళీ (క్లియర్‌ వెకెన్సీ) ఉండాలని, అక్కడి స్థానిక ఉద్యోగులను ప్రభావితం చేయరాదని నిర్దేశించింది. మెడికల్‌ గ్రౌండు, వితంతువు బదిలీలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 70 శాతం అంగ వైకల్యం ఉన్నవారిని మెడికల్‌ గ్రౌండుపై బదిలీ చేయవచ్చునని తెలిపింది. వైకల్యంపై ధ్రువీకరణ పత్రం సాధికార సంస్థ నుంచి పొంది ఉండాలని పేర్కొన్నది. మానసిక వైకల్యం గల పిల్లలున్న ఉద్యోగులను ఆ పిల్లలకు అవసరమైన వైద్య సదుపాయాలున్న ప్రాంతాలకు బదిలీ చేయవచ్చునని తెలిపింది. కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులకు కూడా ఈ బదిలీలు వర్తిస్తాయని వివరించింది. క్యాన్సర్‌, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ వంటి మెడికల్‌ గ్రౌండు ఉద్యోగుల బదిలీలను కూడా ఆమోదించాలని తెలిపింది.


  • కొండను తవ్వి ఎలుకను పట్టిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 317 జీవో సమస్యల పరిష్కారానికి క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినా.. ఆ కమిటీ కొండను తవ్వి ఎలుకను పట్టింది తప్ప.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికత సమస్యలను పరిష్కరించలేదు. సబ్‌ కమిటీ ఆరు నెలలపాటు శోధించి సాధించింది ఏమిటంటే గత ప్రభుత్వం చేసిన పనిని ఆమోదించటం మినహా ఏమీ చేయలేకపోయింది. దంపతుల బదిలీలు గత ప్రభుత్వంలో 19 జిల్లాల్లో పూర్తిగా, 13 జిల్లాల్లో స్కూలు అసిస్టెంట్‌ స్థాయి వరకు చేపట్టారు. మిగిలిన వారికి బదిలీలు చేయాల్సి ఉండగా అవకాశం ఉన్నమేరకే చేయాలని, ఫోకల్‌ పాయింట్లకే చేయాల్సిన అవసరం లేదని పేర్కొనడం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్పౌజ్‌ల గురించి మాట్లాడ లేదు. స్థానికత కోల్పోయిన వారి ప్రస్థావనే లేదు. జీవో 317 లోని అసంబద్థమైన నిబంధనల కారణంగా పలువురికి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పునరాలోచన చేసి జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలి.

- తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి


మార్గదర్శకాలు ఇవీ..

  • ఒకే మేనేజ్‌మెంట్‌ కింద పని చేసే టీచర్లు, హెడ్‌మాస్టర్స్‌ మధ్యే బదిలీలు జరగాలి. అంటే స్థానిక సంస్థల(జడ్పీపీ, మండల పరిషత్‌) టీచర్ల మధ్యే పరస్పర బదిలీలు చేయాలి. ఇవి ఒకే కేటగిరీ, ఒకే సబ్జెక్టు, ఒకే మీడియంకు సంబంధించినవై ఉండాలి.

  • జెడ్పీపీ, ఎంపీపీ, ఇతర స్థానిక సంస్థల్లోని బోధనేతర సిబ్బందిని అవే సంస్థలకు పరస్పర బదిలీలు చేయాలి.

  • పరస్పర బదిలీలు కోరుకునే ఇద్దరు ఉద్యోగులు.. తమకు సీనియారిటీ నష్టం జరిగినా పర్వాలేదంటూ అంగీకార పత్రాలు ఇవ్వాలి. బదిలీ అయిన జిల్లాలోని సీనియారిటీ జాబితాలో చివరి ర్యాంకులో చేరాల్సి ఉంటుంది.

  • పరస్పర బదిలీలను ఉద్యోగుల కోరిక మేరకు జరిగినవిగా భావిస్తారు. ఈ దృష్ట్యా టీఏ, డీఏలు క్లెయిమ్‌ చేసుకోవడానికి వీల్లేదు.

  • కోర్టు ఆర్డర్ల మేరకు సస్పెన్షన్లు, క్రమ శిక్షణ చర్యలకు గురైనవారు, అనధికారికంగా గైర్హాజరైనవారు పరస్పర బదిలీలకు అనర్హులు.

  • ఒక ఉద్యోగి మరో ఉద్యోగికి మాత్రమే పరస్పర బదిలీకి అంగీకారం తెలపాలి. ఒకరికంటే ఎక్కువ మందితో అంగీకారాన్ని కుదుర్చుకుని ఉండరాదు.

Updated Date - Dec 01 , 2024 | 04:25 AM