Share News

Tummala Nageswara Rao: దిగజారుడు రాజకీయాలు

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:02 AM

రైతు రుణమాఫీపై దిగజారుడు రాజకీయాలు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రైతాంగాన్ని అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకుల ప్రవర్తన ఉండటం దురదృష్టకరమన్నారు.

Tummala Nageswara Rao: దిగజారుడు రాజకీయాలు

  • రైతులను అయోమయానికి గురిచేస్తున్న ప్రతిపక్షాలు

  • రూ.2 లక్షలలోపు రైతు రుణాలన్నీ మాఫీ చేశాం

  • 22,37,848 మందికి రూ.17,933 కోట్లు ఇచ్చాం

  • రుణమాఫీ కాని వారు ఏఈవోలను కలవాలి

  • నెల రోజుల్లో రైతుల దరఖాస్తులను పరిష్కరిస్తాం

  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీపై దిగజారుడు రాజకీయాలు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రైతాంగాన్ని అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకుల ప్రవర్తన ఉండటం దురదృష్టకరమన్నారు. నిజంగా రైతు సంక్షేమాన్ని కోరేవారు ముందుగా వారు గత పదేళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలను తెప్పించుకొని చెల్లించాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15కల్లా రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశామని తుమ్మల శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.


దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంత వరకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొదటి పంట కాలంలోనే రూ.31,000 కోట్ల నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించుకొని, రూ.2 లక్షల లోపు రైతు రుణమాఫీని అమలు చేసిన దాఖలాల్లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 35 బ్యాంకులకు సంబంధించిన 3,292 బ్రాంచులు, 909 వ్యవసాయ పరపతి సంఘాల శాఖల నుంచి 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేశామని తెలిపారు.


రూ.2 లక్షలకు మించి రుణాలు కలిగి ఉన్నవారు.. ఆ పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులో చెల్లిస్తే.. 2 లక్షలు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రుణమాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలవాలని.. వారి నుంచి వచ్చిన దరఖాస్తులను నెలలో పరిష్కరిస్తామని తెలిపారు. పథకానికి సంబంధించినవివరాలను తుమ్మల వెల్లడించారు.


  • జూలై 18న రూ.లక్షలోపు రుణాలున్న 11,50,193 మందికి రూ.6,098.93 కోట్లు విడుదల చేశాం.

  • జూలై 30న రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల దాకా రుణాలు కలిగిన 6,40,823 మందికి రూ. 6,190.01 కోట్లు చెల్లించాం.

  • ఆగస్టు 15న రూ.2 లక్షలలోపు రుణాలు కలిగిన 4,46,832 మందికి ఖాతాల్లో రూ.5644.24 కోట్లు జమచేశాం. మొత్తంగా 22,37,848 మంది ఖాతాల్లో రూ.17,933.19 కోట్లు జమ చేశాం.

  • రుణమాఫీకి రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకోలేదు. కుటుంబ నిర్ధారణకు రేషన్‌కార్డులోని వివరాలను పరిగణనలోకి తీసుకున్నాం.

  • రేషన్‌ కార్డు లేనివారు, ఆధార్‌ కార్డు వివరాలు తప్పుగా నమోదైనవారు మరే ఇతర కారణాలతోనైనా రుణమాఫీకి నోచుకోని వారు సమీపంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి, తగిన వివరాలు అందిస్తే,వారికీ త్వరలోనే రుణమాఫీ చేస్తాం.

  • దీనిపై వ్యవసాయాధికారులందరికీ ఆదేశాలిచ్చాం.

  • మండల పరిధిలో ఉన్న అన్ని బ్యాంకు బ్రాంచులు/వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎ్‌స)లకు సంబంధించిన అన్ని సమస్యాత్మక ఖాతాలకు పూర్తి బాధ్యత ఆ మండల వ్యవసాయాధికారినే తీసుకుంటారు.

  • కుటుంబ నిర్ధారణ కోసం మండల వ్యవసాయాధికారి రైతు వద్దకు వెళ్లి ఆధార్‌ వివరాలు తీసుకుని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

  • ఒకవేళ రుణ ఖాతాలో నమోదైన పేరు, ఆధార్‌లో నమోదైన పేరుతో సరిపోలకపోతే.. ఖాతాదారుని దగ్గర సరైన వివరాలు ేసకరించి పోర్టల్‌లో అప్‌ లోడ్‌ చేసి, మాఫీ ప్రయోజనాలు వర్తింపచే స్తారు.

  • ఒకవేళ బ్యాంకు సమర్పించిన అసలు, వడ్డీలలో తేడా ఉన్నట్లయితే అధికారికి తెలియజేయాలి.

  • రోజువారీ అందిన ఫిర్యాదులను జిల్లా వ్యవసాయాధికారి సాయంత్రం 5లోపు డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపించాలి.

  • మొదటి, రెండో విడత రుణమాఫీలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి రూ.44.95 కోట్లు నిధులు ఇప్పటికే విడుదల చేశాం.

  • బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలతో దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయి. వీటిలో ఉన్న చిన్న చిన్న తప్పులను గుర్తించి వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సరిచేస్తోంది. ఇప్పటికే 8 వేల ఖాతాలకు డబ్బులు తిరిగి జమ చేశాం.

Updated Date - Aug 18 , 2024 | 03:03 AM