TG : రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు
ABN , Publish Date - Aug 07 , 2024 | 05:49 AM
హైదరాబాద్ మహా నగరానికి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి
ప్రాజెక్టు నుంచి 15 టీఎంసీలు తెచ్చేలా ప్లాన్
హైదరాబాద్‌లో తాగునీటికి10 టీఎంసీలు
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌తో పాటు మూసీ నది ప్రక్షాళనకు 5 టీఎంసీలు
ప్రాజెక్టుకు 5,560 కోట్లు కేటాయిస్తూ జీవో
రెండేళ్లలో పూర్తి చేయాలని సర్కారు లక్ష్యం
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహా నగరానికి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించే పనులకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే నగరంలో తాగునీటి అవసరాల కోసం గోదావరి మొదటి దశ ద్వారా 163 ఎంజీడీల(మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీరు సరఫరా చేస్తుండగా.. ఇప్పుడు రెండో దశ నీటిని తరలించేందుకు సన్నద్ధమవుతోంది.
ఇందు కోసం రూ.5,560 కోట్లను కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ పథకం కింద 15 టీఎంసీల నీటిని తరలించనున్నారు. దీని ద్వారా నగరానికి తాగునీటిని తరలించడంతోపాటు మూసీ నది మీద నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వరకు వాటర్‌బోర్డు భరిస్తుండగా.. 60శాతం నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2030 అవసరాలను దృష్టిలో పెట్టుకుని..
ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వివిధ జలాశయాల నుంచి 580-600 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. 2030 అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 170 ఎంజీడీల నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గోదావరి నుంచి 30 టీఎంసీల నీటిని వాడుకునే వెసులుబాటు ఉండటంతో అదనపు జలాల కోసం రెండోదశ పనులు చేపట్టాలని నిర్ణయించింది. 2030 వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలు 750 ఎంజీడీలకు పెరుగుతాయని సర్కారు అంచనా వేసింది. 2050 నాటికి ఇది 1014 ఎంజీడీలకు చేరుతుందని, అందులో భాగంగానే మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీటిని తరలించే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి.
మల్లన్నసాగర్ నుంచి తరలింపు ఇలా..
గోదావరి తొలి దశ ప్రాజెక్టు కింద నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలికి ఇప్పటికే ఏటా 10 టీఎంసీల నీరు తరలిస్తున్నారు. తాజాగా రెండో దశ పనుల ద్వారా 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ నుంచి ఏటా 15 టీఎంసీల నీటిని తరలించనున్నారు.
ఇందులో 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు.. మిగిలిన 5 టీఎంసీలు జంట జలాశయాల పునరుజ్జీవం, మూసీ ప్రక్షాళన కోసం వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను వ్యాప్కోస్ సంస్థ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి శామీర్‌పేట వద్ద గల ఘన్‌పూర్ వరకు 3,600 ఎంఎం వ్యాసం కలిగిన భారీ పైపులైన్ నిర్మించనున్నారు. అక్కడి నుంచి జంట జలాశయాలకు చేరేవిధంగా ఓ పైపులైన్.. నగర తాగునీటి అవసరాల కోసం మరో పైపులైన్ నిర్మిస్తారు.
ఘన్‌పూర్ నుంచి నగరానికి..
ఘన్‌పూర్‌లో 780 ఎంఎల్‌డీల నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. అక్కడి నుంచి 2400 ఎంఎం వ్యాసం కలిగిన పైపులైన్ ద్వారా 10 టీఎంసీలను నగరానికి తరలించనున్నారు. గోదావరి జలాలను ఫేజ్-1 కింద ఇప్పటికే ఘన్‌పూర్ నుంచి మూడు రింగ్ మెయిన్ పైపులైన్లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు అందిస్తున్నారు. ఒక రింగ్ మెయిన్ బిట్స్ పిలానీ మీదుగా సైనిక్‌పూరి ప్రాంతానికి గోదావరి జలాలను తరలిస్తుండగా..
రెండో రింగ్ మెయిన్ కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి మీదుగా లింగంపల్లికి.. మూడో రింగ్ మెయిన్ నుంచి ఔటర్ వెంట పటాన్‌చెరు మీదుగా కోకాపేట ప్రాంతానికి గోదావరి జలాలను తరలిస్తున్నాయి. అయితే ఫేజ్-2 ప్రాజెక్టులో భాగంగా ఘన్‌పూర్ నుంచి నాలుగో రింగ్ మెయిన్ పైపులైన్‌ను 40 కి.మీ. మేర ముత్తంగి వరకు వేయనున్నారు. దీనిని ఇప్పటికే ఉన్న రింగ్ మెయిన్లకు అనుసంధానం చేస్తారు. దీంతో కోకాపేట, కొల్లూరు, ఐటీ కారిడార్ ప్రాంతానికి నేరుగా గోదావరి జలాలు అందనున్నాయి.
జంట జలాశయాలకు తరలింపు ఇలా..
ఘన్‌పూర్ నుంచి 2200ఎంఎం వ్యాసం కలిగిన పైపులైన్‌ను ఔటర్ అవతలి భాగం నుంచి ముత్తంగి, కొల్లూరు, ఇంద్రారెడ్డి కాలనీ, జన్వాడ మీదుగా జన్వాడ-ఖానాపూర్ మధ్యలో నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు నిర్మిస్తారు. ఈ పైప్‌లైన్ దాదాపు 58కి.మీ. మేర ఉంటుంది. ఉస్మాన్‌సాగర్‌లో గోదావరి జలాలు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత హిమాయత్ సాగర్‌లోకి వెళ్లేందుకు చర్యలు తీసుకుంటారు.
జంట జలాశయాలు నిండిన తర్వాత మూసీ నదిలోకి నీటిని వదులుతారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఉస్మాన్‌సాగర్ దిగువన 120ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే), హిమాయత్‌సాగర్ దిగువన 70ఎంఎల్‌డీల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు.