Share News

Khammam: మహిళలకు లక్షకోట్ల వడ్డీ లేని రుణాలు

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:21 AM

రాష్ట్రంలోని మహిళలకు ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Khammam: మహిళలకు లక్షకోట్ల వడ్డీ లేని రుణాలు

  • ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంఎ్‌సఎంఈ పార్క్‌లు: భట్టి

ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలకు ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు వడ్డీలేని రుణాలు నిలిపివేశారన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళలకు వడ్డీలేని రుణాల కార్యక్రమాన్ని పున:ప్రారంభించామని చెప్పారు. ప్రతి ఏటా మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.


ఈ రుణాలకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో వడ్డీ చెల్లిస్తుందన్నారు. మహిళలు తీసుకున్న రుణాలతో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలని, దీనికోసం అవసరమైన శిక్షణ, తోడ్పాటును కూడా ప్రభుత్వమే అందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో మహిళలకు ప్రత్యేకంగా చిన్న, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఎంఎ్‌సఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంఘాలు చేసే ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ మహిళల అభివృద్ధి దేశానికి ఆదర్శంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 05:21 AM