Share News

Ponguleti: రేషన్‌కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇల్లు

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:57 AM

రేషన్‌కార్డు లేకపోయినా మొదటివిడతలోనే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Ponguleti: రేషన్‌కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇల్లు

  • మొదటివిడతలో ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం

  • పేద, నిరుపేద విభాగాల వారీగా ఎంపిక : పొంగులేటి

కూసుమంచి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డు లేకపోయినా మొదటివిడతలోనే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం తిరుమలాయపాలెం మండల ప్రజాప్రతినిధులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు పేద, నిరుపేద అనే విభాగాల వారీగా దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు.


ఎటువంటి రాజకీయాలకు తావులేకుండా పారదర్శకంగా ఇళ్లు ఇస్తామన్నారు. మొదటివిడతలో రేషన్‌ కార్డులు లేకపోయినా అర్హులందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. త్వరలోనే రేషన్‌కార్డుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని, రెండోవిడతలో రేషన్‌కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులవుతారని మంత్రి తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని ఆదేశించారు. అర్హులైన వికలాంగులను, వృద్ధులను, వితంతువులను గుర్తించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.

Updated Date - Nov 05 , 2024 | 03:57 AM