Share News

job portal: దివ్యాంగులకు జాబ్‌ పోర్టల్‌

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:48 AM

దివ్యాంగులు ఇకపై కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను తీసుకొచ్చామని పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

job portal: దివ్యాంగులకు జాబ్‌ పోర్టల్‌

  • బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీపై సర్కారు కసరత్తు

  • గ్రామీణ రోడ్లకు రూ.1,377 కోట్లు: సీతక్క

హైదరాబాద్‌/మల్లాపూర్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు ఇకపై కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను తీసుకొచ్చామని పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్‌ పోర్టల్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇతరులతో పోటీ పడేందుకు దివ్యాంగులకు ఎన్నో అవరోధాలు ఉంటాయని.. ఈ నేపథ్యంలోనే వారికి ఉద్యోగాల కల్పనకు యూత్‌ ఫర్‌ జాబ్స్‌ స్వచ్ఛంద సంస్థతో కలిసి vikalangulajobportal.telangana.gov.in జాబ్‌ పోర్టల్‌ను రూపొందించామన్నారు.


ఇందులో రిజిస్టర్‌ చేసుకుంటే.. వారి అర్హతల ఆధారంగా ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. ప్రైవేటు సంస్థలు సైతం ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల కోటా బ్యాక్‌లాగ్‌ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1377.66 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. 92 నియోజకవర్గాల పరిధిలో 641 పనులకు అనుమతి దక్కిందని.. గ్రామీణ ప్రాంతాల్లో 1323కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నట్లు వెల్లడించారు.


  • బాలామృతం తయారీలో నిర్లక్ష్యమా..?

అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు అందించే బాలామృతం తయారీలో టీజీ ఫుడ్స్‌ అధికారుల నిర్లక్ష్యంపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నాచారం పారిశ్రామికవాడలోని టీజీ ఫుడ్స్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి అపరిశుభ్ర పరిసరాలు, అధికారుల తీరుపైౖ అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులకు అందించే ఆహారం విషయంలో ఇంత నిర్లక్ష్యమేంటని.. నెల రోజులుగా ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనిచేయకున్నా పట్టించుకోరా అని మండిపడ్డారు. బాలామృతం నాణ్యతపై ల్యాబ్‌ నివేదిక అందించాలని ఆదేశించారు.


పదేళ్లుగా నూతన యూనిట్‌ పనులు ముందుకు సాగకపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కాగా, గాంధీభవన్‌లో మంగళవారం జరగనున్న ‘మంత్రితో ముఖాముఖి’లో సీతక్క పాల్గొననున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.. ఇటు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన మంగళ, బుధ వారాల్లో మెదక్‌, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ నేతల సమావేశాలు జరగనున్నాయి.

Updated Date - Oct 15 , 2024 | 04:48 AM