Hyderabad: రైతుబంధులో రూ. 26,500 కోట్లు దుబారా..
ABN , Publish Date - Jun 28 , 2024 | 04:12 AM
రైతు భరోసా అంశంలో బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే మతి భ్రమించి మాట్లాడుతున్నారని అనిపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు బంధు అమలులో అనుసరించిన విధానాల వల్ల గత ప్రభుత్వం రూ.26,500 కోట్ల ప్రజాధనం దుబారా చేసిందని ఆరోపించారు.
గత సర్కారుపై మంత్రి తుమ్మల ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా అంశంలో బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే మతి భ్రమించి మాట్లాడుతున్నారని అనిపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు బంధు అమలులో అనుసరించిన విధానాల వల్ల గత ప్రభుత్వం రూ.26,500 కోట్ల ప్రజాధనం దుబారా చేసిందని ఆరోపించారు. రైతు భరోసా విధివిధానాలు ఏమిటి ? రైతు భరోసా ఎప్పుడిస్తారు ? అని బీఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు మాట్లాడటం చూస్తుంటే వారికి మతిమరుపు ఉందనుకోవాలా? వాళ్లు చేసిన తప్పులను రైతులు మర్చిపోయారని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు పథకం ఎలా అమలైందో ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. 2018లో వానాకాలం 128 రోజులు (4 నెలల 5 రోజులు), యాసంగిలో 161 రోజులు, 2019 వానాకాలంలో 138 రోజులు, 2020 వానాకాలంలో 169 రోజులు, 2021- 22 యాసంగిలో 84 రోజులు, 2022- 23 యాసంగిలో 148 రోజులు, 2023 వానాకాలంలో 108 రోజుల పాటు బీఆర్‌ఎస్ సర్కారు రైతుబంధు నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కోడిగుడ్డు మీద ఈకలు ఏరుతున్నట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. అప్పటి రైతుబంధులో గుట్టలకు, రాళ్లూరప్పలకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, జాతీయ రహదారులకు, బంజరు భూములకు 12 విడతల్లో రూ.26,500 కోట్లు ఇచ్చి ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు.