Share News

HYD : విరాళాల్లో పోటాపోటీ!

ABN , Publish Date - Sep 04 , 2024 | 05:39 AM

రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు ఇవ్వడంలో ఉద్యోగ సంఘాల నాయకులు పోటీ పడ్డారు.

HYD : విరాళాల్లో పోటాపోటీ!

  • ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య పోరు

  • 100 కోట్లు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల

  • జేఏసీ చైర్మన్‌.. 130 కోట్లు ఇస్తామన్న ఐకాస చైర్మన్‌

  • పింఛనుదారుల ఐకాస రూ.33 కోట్ల విరాళం

హైదరాబాద్‌, మహబూబాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు ఇవ్వడంలో ఉద్యోగ సంఘాల నాయకులు పోటీ పడ్డారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున ఆ సంఘం చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి మంగళవారం ఉదయం వరద బాధితుల సహాయార్థం రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, దీనికి ఉద్యోగుల తరఫున చేయూతగా ఒక రోజు మూలవేతనం రూ.100 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నామని ప్రకటించారు.

తెలంగాణలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల తరఫున సమష్టి నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కలిసి అంగీకార పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మారం జగదీశ్వర్‌ నేతృత్వంలోని ఉద్యోగుల ఐకాస స్టీరింగ్‌ సమావేశం నిర్వహించింది.

సీఎం సహాయ నిధికి ఉద్యోగుల ఒక రోజు మూల వేతనం రూ.130 కోట్లు అందజేస్తున్నట్లు ఐకాస చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ఇతర సంఘాల నాయకులు తీర్మానం చేశారు. అనంతరం ఐకాస నాయకులు మహబూబాబాద్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి లేఖను అందజేశారు. సంఘాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతర పెండింగ్‌ బిల్లులపై మాట్లాడని నాయకులు.. ఎవరికి తోచినట్లు వారు ఒక రోజు మూలవేతనంపై ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. రెండు సంఘాల నాయకులు ఎవరికి తోచినట్లు వారు నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు.


  • పింఛనుదారుల ఐకాస రూ.33 కోట్ల విరాళం

తెలంగాణ ప్రభుత్వ పింఛనుదారుల ఐకాస చైర్మన్‌ కె.లక్ష్మయ్య అధ్యక్షతన కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. వరదల వల్ల నష్టపోయిన వారి సహాయార్థం పింఛనుదారుల ఒక రోజు మూల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారని, వారి ఒక రోజు మూలవేతనం రూ.33 కోట్ల ఉంటుందని, సెప్టెంబరు నెల పింఛను నుంచి మినహాయించాలని సీఎస్‌ శాంతికుమారిని కోరినట్లు లక్ష్మయ్య తెలిపారు.

Updated Date - Sep 04 , 2024 | 05:39 AM