POCSO Case: పోక్సో కేసులో వైసీపీ నేత అరెస్టు
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:11 AM
అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి తండ్రి వైసీపీ నేత జుబేర్ అహ్మద్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి గురువారం వాయల్పాడు కోర్టులో ప్రవేశపెట్టారు.

అతనితోపాటు మరో ముగ్గురికి రిమాండు
పరారీలోనే అసలు నిందితుడు
కలికిరి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి తండ్రి వైసీపీ నేత జుబేర్ అహ్మద్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి గురువారం వాయల్పాడు కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులు నలుగురికీ వాయల్పాడు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు కోర్టు న్యాయాధికారి గురు అరవింద్ రిమాండు విధించారు. అయితే ఈ కేసులో అసలు నిందితుడు జునేద్ అహ్మద్ (26) ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లాకు చెందిన బాలిక కలికిరి మండలంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. మైనారిటీ గురుకుల పాఠశాలలో జూనియర్ ఇంటర్ చదువుతోంది. ఈ ఏడాది జనవరి 25న అమ్మమ్మ వద్దకు వచ్చింది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి బాలిక కనపడకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెంది కలికిరి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ లోగా ఒక కారులో బాలికను ఇంటి వద్ద వెళ్లిపోయినట్టు కుటుంబీకులు గుర్తించారు. స్థానిక వైసీపీ నేత జుబేర్ అహ్మద్ పెద్ద కొడుకు జునేద్ అహ్మద్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు తెలిపింది. గతేడాది ఆగస్టు నుంచి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ వచ్చాడని చెప్పింది. దీనిపై రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న మదనపల్లె డీఎస్పీ కొండయ్యనాయుడు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారనే అభియోగాలతో నిందితుడి తండ్రి జుబేర్ అహ్మద్, సోదరుడు బిలాల్ అహ్మద్, స్నేహితులు నూరుల్లా, మునీర్‌ను కేసులో చేర్చారు.