Minister K. Ram Mohan Naidu : ఏవియేషన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:21 AM
ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా మారుస్తామని, ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చెప్పారు.
డ్రోన్ హబ్‌గా మన ఓర్వకల్లు
డీప్ టెక్నాలజీతో స్వర్ణాంధ్ర విజన్-2047 సాధ్యం
విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
కొత్త ఆలోచనలతో వస్తే స్టార్ట్టప్‌గా ప్రోత్సాహం
విశాఖ డీప్ టెక్నాలజీ సదస్సులో-2025 కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు
విశాఖపట్నం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా మారుస్తామని, ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చెప్పారు. విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరుగుతున్న రెండు రోజుల ఏపీ డీప్ టెక్నాలజీ సదస్సు-2025కు ఆయన గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయలు అత్యధిక సంఖ్యలో విమాన ప్రయా ణం చేస్తున్నా సొంతంగా ప్రయాణికుల విమానం తయారు చేసుకోలేని స్థితిలో ఉన్నామని, రాబోయే ఐదేళ్లలో ఆ లోటు తీర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ‘‘ఇప్పుడు ఐటీ రంగంలోకి డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివి అనేకం వచ్చాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించని రంగం లేదు. ప్రపంచ సమస్యలకు ఏ మారుమూల ప్రాంతం నుంచైనా టెక్నాలజీతో పరిష్కారాలు చూపించవచ్చు. ఏపీ కూడా అందులో అగ్రస్థానంలో ఉండాలి. ముఖ్యమంత్రి కలగంటున్న విజన్-2047 స్వర్ణాంధ్ర సాధ్యం కావాలంటే దానికి డీప్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. విమానయాన రంగం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి సాధించింది. భూమి అందుబాటులో ఉంటే ఏడాదిన్నర కాలంలో ప్రపంచస్థాయి విమానాశ్రయం నిర్మించే స్థితికి భారతదేశం చేరింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి సంబంధించి ఎవరికి కొత్త ఆలోచనలు వచ్చినా వాటిని స్టార్ట్‌ప్సగా స్వీకరిస్తాం. ఇదే వేదికపై నుంచి ఆహ్వానిస్తున్నాం. వంద శాతం దేశీయ డ్రోన్ల తయారీని ప్రోత్సహిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా పీఎల్‌ఐ పథకం పెట్టి రూ.120 కోట్లు కేటాయించాం. డ్రోన్ పరికరాల దిగుమతిపై నిషేధం కూడా విధించాం’’ అని రామ్మోహన్ తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎస్‌టీపీఐ అదనపు డైరెక్టర్ సతీశ్, సదస్సు నిర్వాహకులు శ్రీధర్ కొసరాజు పాల్గొన్నారు.
మెడ్‌టెక్ జోన్‌లో తొలి ఏఐ సెజ్: మెడ్‌టెక్
ప్రపంచంలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే తొలి ప్రత్యేక ఆర్థిక మండలి (ఏఐ-ఎ్‌సఈజెడ్) విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వ్యవస్థాపక సీఈఓ జితేంద్రశర్మ తెలిపారు. డీప్ టెక్నాలజీ సదస్సు-2025లో ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయంలో ప్రపంచంలో రోజుకు 12 లక్షల ఆర్‌టీపీసీఆర్ కిట్లు వినియోగించగా, అందులో 11 లక్షలు మెడ్‌టెక్ జోన్‌లో తయారైనవి అని చెప్పారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన విజన్ కారణమన్నారు. ప్రపంచంలో సీటీ స్కానర్ తయారీ కంపెనీలు 4 ఉంటే ఒకటి ఇక్కడే ఉందన్నారు. అందుబాటులో ఉన్న వైద్యుల సహకారంతో 5జీ టెక్నాలజీ ద్వారా టెలీ సర్జరీ చేయడానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఏఐతో మెరుగైన వైద్య సేవలు: డాక్టర్ రమేశ్ పోతినేని
ఏఐతో వైద్య రంగంలో మెరుగైన సేవలు అందించవచ్చునని విజయవాడ రమేశ్ ఆస్పత్రుల అధినేత డాక్టర్ రమేశ్ పోతినేని చెప్పారు. ఏపీ డీప్ టెక్నాలజీ సదస్సులో ‘వియర్‌బుల్ డివైజె్‌స...ప్రివెంటివ్ హెల్త్‌కేర్, ఏఐ బేస్డ్ పర్సనల్ మెడికేషన్’ అనే అంశంపై గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశంలోనే మొదటిగా ఏఐను ఉపయోగించి వైద్యసేవలను మెరుగుపరిచిన ఘనత తమకు దక్కుతుందన్నారు. టెలీ-ఐసీయూ సిస్టమ్‌కు ఏఐను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రోగులకు పర్యవేక్షిస్తూ అవసరమైన మందులను అందిస్తున్నామన్నారు.
విజన్-2047కి సంపూర్ణ సహకారం
ఏపీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని, విజన్-2047కు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎన్‌ఆర్‌ఐ, సింగపూర్ నివాసి ఆనంద్ గోవిందలూరి తెలిపారు. గురువారం డీప్ టెక్నాలజీ సదస్సు ప్రాంగణంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ, స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఏపీ అమలుచేస్తున్న ఐటీ పాలసీ ప్రోత్సాహకరంగా ఉందన్నారు. సింగపూర్‌లో వెంచర్ కేపిటలి్‌స్టగా సేవలందిస్తున్న ‘గోవిన్ కేపిటల్స్’ ఏపీలో డిజిటల్ హెల్త్, ఎడ్యుకేషన్ స్టార్ట్‌పలకు పెట్టుబడి సహకారం అందిస్తుందన్నారు.
సందడి చేసిన రోబో డాగ్
ఏపీ డీప్ టెక్నాలజీ సదస్సులో రోబో డాగ్ సందడి చేసింది. పైటెక్ సంస్థ ప్రదర్శించిన ఈ సాంకేతిక శునకం అందరినీ ఆకట్టుకుంది. ఏఐతో పనిచేసే ఈ రోబో డాగ్‌ను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. ఇది నడుస్తుంది. పరుగెడుతుంది. డ్యాన్స్ చేస్తుంది. ఈ శునకాలను నిఘా అవసరాలకు ఉపయోగించుకోవచ్చునని నిర్వాహకులు తెలిపారు. వీటికి అమర్చిన కెమెరాల ద్వారా అది ఎక్కడికి వెళితే.. అక్కడి దృశ్యాలను అందిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన ట్రంప్ ఇలాంటి 250 రోబో డాగ్‌లను తన భవనంలో సెక్యూరిటీ కోసం ఉపయోగించారని నిర్వాహకులు తెలిపారు. వీటివిలువ రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటుందన్నారు.