Araku Celebrations : అరకు చలి ఉత్సవం అదిరే ఆరంభం
ABN , Publish Date - Feb 01 , 2025 | 05:23 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ‘చలి ఉత్సవ్-25’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.

ఆకట్టుకున్న గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు.. ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్
అరకులోయ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ‘చలి ఉత్సవ్-25’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేశ్‌కుమార్ ఉత్సవ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించే అరకు ఉత్సవ్‌ను స్థానికులు, పర్యాటకులు ఆస్వాదించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు శుక్రవారం గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉదయం 5కే రన్, స్థానిక గిరిజన మ్యూజియం ఆవరణలో ముగ్గులు, పెయింటింగ్ పోటీలు, సాయంత్రం కార్నివాల్ నిర్వహించారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకూ వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఉత్సవ్ ప్రధాన వేదిక (అరకులోయ డిగ్రీ కళాశాల మైదానం) వద్ద ఆదివాసీలు, ఇతరుల చేతివృత్తుల ఉత్పత్తులతో 25 స్టాళ్లను ఏర్పాటుచేశారు. ఈ చలి ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్ మొత్తం కార్యక్రమానికే ఓ ప్రత్యేకతగా నిలిచింది. సందర్శకులను హెలికాప్టర్‌లో సుమారు ఐదు, నిమిషాలు అరకులోయ పరిసరాల్లో తిప్పారు. మాడగడ సన్‌రైజ్ హిల్స్ వద్ద టెండమ్ గ్లైడింగ్, పారా గ్లైడింగ్, పద్మాపురం గార్డెన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులో ఉంచారు. శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తారని అధికారులు భావిస్తున్నారు.
For AndhraPradesh News And Telugu News