Archery Jyothi Surekha : హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:17 PM
jyothi surekha: ఏపీ హైకోర్టు ఆదేశాలపై ఆర్చర్ జ్యోతి సురేఖ స్పందించారు. ఈ ఆదేశాలు తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.

విజయవాడ, జనవరి 29 : తనకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించడం ఆనందం కలిగించిందని ఆర్చర్ జ్యోతి సురేఖ తెలిపారు. బుధవారం విజయవాడలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆర్చర్ జ్యోతి సురేఖ మాట్లాడుతూ.. తాను అనేక టోర్నమెంట్లలో చాలా మెడల్స్ సాధించానని తెలిపారు. ప్రముఖ పోటీల్లో సైతం గోల్డ్ మెడల్స్ సాధించానని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సహాలు ఉన్నా.. అవార్డుల విషయంలో మాత్రం తన ప్రతిభను గుర్తించ లేదనే ఓ ఆవేదన అయితే తనకు ఉందన్నారు. తనకు అవార్డు కేటాయించడంలో కమిటీ సభ్యులంతా ఏకాభిప్రాయానికి రాలేదా? లేక ఇతర మరేమైన కారణాలు ఉన్నాయా? అనేది తనకు తెలియదని చెప్పారు.
తాము అన్ని వివరాలతో ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు సైతం చేసుకున్నామని వివరించారు. ఇటీవల క్రీడల అవార్డుల ప్రకటనలో తన పేరు లేక పోవడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి.. అన్ని వివరాలు సమర్పించామని పేర్కొన్నారు. దాంతో తనకు ఖేల్ రత్న అవార్డును ఇవ్వాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.
హైకోర్టు తీర్పుపై కేంద్రం సానుకూలంగా స్పందించి.. తనకు అవార్డు అందజేస్తుందని భావిస్తున్నట్లు జ్యోతి సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరగనున్న టోర్నమెంట్లకు అన్ని విధాలా తాను సిద్ధమవుతున్నానని స్పష్టం చేశారు. తప్పకుండా మరోసారి పతకాలు సాధించి.. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని మరింత పెంచేలా కృషి చేస్తానని ఆర్చర్ జ్యోతి సురేఖ తెలిపారు.
భారత ప్రభుత్వం ఇటీవల క్రీడా అవార్డులను ప్రకటించింది. అయితే వాటిలో జ్యోతి సురేఖ పేరు లేదు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆర్చరీలో ఆమెకు గతంలో వచ్చిన అవార్డులు, రివార్డులను న్యాయ స్థానం పరిశీలించింది. దీంతో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఆమె అన్ని విధాలా అర్హురాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఇక అవార్డుల విషయంలో జ్యోతి సురేఖకు అన్యాయం జరిగిందంటూ న్యాయ సంస్థ ఉన్నమ్ లా ఫర్మ్ ఏపీ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఈ అంశంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్యోతి సురేఖ సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకోవాలని.. ఆమెకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించిన విషయం విధితమే.
For AndhraPradesh News And Telugu News