Single window: సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 01:01 AM
సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఈ విషయమై సూచనలందడంతో.. త్రిసభ్య కమిటీకి అర్హుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.

చిత్తూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసింది. రైతులకు సేవలందించాల్సిన సొసైటీలను రాజకీయ వేదికలుగా మార్చేసింది. ఫలితంగా గత ఐదేళ్లూ వాటి ద్వారా రైతులకు ఎలాంటి భరోసా లభించలేదు. ఈ నేపథ్యంలో సహకార వ్యవస్థ ప్రక్షాళన తర్వాతే సంఘాల ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొంతకాలం పాటు సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఈ విషయమై సూచనలందడంతో.. త్రిసభ్య కమిటీకి అర్హుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 76, చిత్తూరు జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇప్పటివరకు అధికారులే పర్శన్ ఇన్‌ఛార్జిలుగా వ్యవహరించగా, ఇకనుంచి ఎన్నికలు జరిగే వరకు త్రిసభ్య కమిటీలే ప్రాతినిధ్యం వహించనున్నాయి.2013 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగ్గా 2018లో కమిటీలకు పదవీకాలం ముగిసింది.అయితే పాత కమిటీలనే కొనసాగించారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పాలకవర్గాలను రద్దు చేసి త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ పార్టీ వర్గీయులే ఈ కమిటీల్లో పదవులు పొందారు. ఆ తర్వాత కమిటీల పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే వారు పదవులకు రాజీనామా చేశారు. తాజాగా ప్రభుత్వం త్రిసభ్య కమిటీలు వేయాలనే ఆలోచన చేయడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులు ఎమ్మెల్యేలతో సిఫార్సు చేయించుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికలు జరిగితే ఆరుగురు సభ్యులతో పాటు ఓ ఛైర్మన్ ఉంటారు. నాటి తప్పుల ప్రక్షాళన కోసం నియమిస్తున్న ఈ త్రిసభ్య కమిటీలో ఓ ఛైర్మన్, ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు. ఎన్నికలు జరిగితే పాలకవర్గం పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఇప్పుడు త్రిసభ్య కమిటీ పదవీకాలం ఆరు నెలల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ హయాంలో త్రిసభ్య కమిటీలదే ఇష్టారాజ్యం
ఉమ్మడి జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి సూచించిన వారితో 76 సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలు వేశారు. ప్రతి ఆరు నెలలకోసారి వీటి పదవీ కాలాన్ని ప్రభుత్వం పెంచుకుంటూ పోయింది. ఐదేళ్ల పాటు ఈ కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. 2020-21, 2021-22 సంవత్సరాల్లో ఉమ్మడి జిల్లాలోని 25కుపైగా విండోలు జేఎల్‌జీ (జాయింట్ లయబులిటీ గ్రూపు) రుణాలను ఇచ్చాయి. పెద్దిరెడ్డి చెప్పిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకే ఈ రుణాలు ఇవ్వడంతో నయా పైసా రికవరీ కాలేదు. రైతుల పేరిట ఇచ్చామంటూ విండోల త్రిసభ్య కమిటీలు రూ.కోట్ల రుణాలను పక్కదారి పట్టించాయి.