YCP: ఏం మారింది సారూ?
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:25 AM
జగన్ ప్రభుత్వం మొదటి విడత ‘‘మన బడి... నాడు-నేడు’’ కింద అభివృద్ధి చేసిన స్కూళ్ల స్థితిగతులెలా వున్నాయో.. పరిశీలనకు పూనుకుంది ఆంధ్రజ్యోతి. మంగళవారం మా ప్రతినిధులు కొన్ని పాఠశాలలను సందర్శించి వాటి స్థితిగతులను సచిత్రంగా అందిస్తున్నారు.

అరకొర పనులతో అసంపూర్తిగా వదిలేసిన వైనం
పూర్తయిన పనులకూ నిర్వహణ లోపం
ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు
తిరుపతి, ఆంధ్రజ్యోతి: కార్పొరేట్ బడులు వెలవెలపోయేంతగా ప్రభుత్వ బడుల రూపురేఖలే మార్చేస్తాం అన్నారు. అందమైన భవనాలు, ఫర్నిచర్.. ఫిల్టర్ వాటర్, శుభ్రమైన టాయ్‌లెట్లు... ఒక అద్భుతం చేసి చూపిస్తాం అని చెప్పారు. ‘‘మన బడి... నాడు-నేడు’’ అని దానికి పేరు కూడా పెట్టి ఊదరగొట్టారు. జగన్ ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులుగా చెప్పుకున్న ఈ బడులు జిల్లాలో ఎలా ఉన్నా యి? నిజంగానే రూపురేఖలు మారిపోయాయా? జగన్ ప్రభుత్వం మొదటి విడత ‘‘మన బడి... నాడు-నేడు’’ కింద అభివృద్ధి చేసిన స్కూళ్ల స్థితిగతులెలా వున్నాయో.. పరిశీలనకు పూనుకుంది ఆంధ్రజ్యోతి. మంగళవారం మా ప్రతినిధులు కొన్ని పాఠశాలలను సందర్శించి వాటి స్థితిగతులను సచిత్రంగా అందిస్తున్నారు.
పాకాల: రక్షిత నీరు లేదు
పాకాల, ఆంధ్రజ్యోతి: పాకాలలో ఇంగ్లీషు, తెలుగు మీడియం స్కూళ్ళు ఒకే ఆవరణలో వున్నాయి. అదనపు తరగతి గది నిర్మాణం అసంపూర్తిగా వుంది. టాయిలెట్ బ్లాక్ సైతం అసంపూర్తిగానే వుంది. తాగునీటి ఆర్వో సిస్టమ్ పనిచేయడం లేదు. మండలంలో మొదటి విడత నాడు-నేడు కింద ఎంపికైన స్కూళ్ళలో 15 స్కూళ్లలో ఆర్వో సిస్టమ్ పనిచేయడం లేదు.
మంగళం ట్రెండ్స్ పాఠశాల: అసంపూర్తి నిర్మాణాలు
తిరుపతి అర్బన్, ఆంధ్రజ్యోతి: జిల్లాలోనే గణనీయంగా అభివృద్ధి చెందిన జడ్పీ హైస్కూలుగా తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని ట్రెండ్స్ పాఠశాలకు గుర్తింపు వుంది. తొలి విడత నాడు-నేడు కింద అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రెండంతస్తుల భవనం శ్లాబులు పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో గోడలు కట్టారు. పై అంతస్తులో అది కూడా లేదు. నిధుల కొరతతో అర్థంతరంగా పనులు ఆపేశారు. తాగునీటి సదుపాయం వుంది కానీ ఫిల్టర్ సిస్టమ్ లేదు. చదువులు చెప్పే ఉపాధ్యాయులకు కుర్చీలు, టేబుళ్ళు వంటి ఫర్నిచర్ ఇంతవరకూ రాలేదు. ప్రహరీ గోడల నిర్మాణం కూడా అసంపూర్తిగా ఆగిపోయింది.
తిరుచానూరు జడ్పీ హైస్కూల్: భయపెడుతున్న గదులు
తిరుచానూరు, ఆంధ్రజ్యోతి: తిరుచానూరు జడ్పీ హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయినా ఫినిషింగ్ పనులు పెండింగులో వున్నాయి. సున్నాలు కూడా కొట్టించలేదు. అయితే ఆ గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గదుల్లో ఎలక్ట్రిఫికేషన్ తూతూ మంత్రంగా చేపట్టారు. గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల కోసం వైర్లు ఎలాబడితే అలా అమర్చివుండడం కనిపించింది.
చిన్నగొట్టిగల్లు బడి: అన్నీ అరకొర పనులే!
చిన్నగొట్టిగల్లు, ఆంధ్రజ్యోతి: చిన్నగొట్టిగల్లు ప్రాధమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. నీటి కొరతతో తాగునీటి ఫిల్టర్ సిస్టమ్ వినియోగంలో లేదు. సరఫరా అవుతున్న కొద్దిపాటి నీరు టాయిలెట్ల వాడకానికే సరిపోతోంది. స్కూలు ప్రహరీ గోడ కూలిపోయి చాలాకాలమైంది. అయినా పనులు చేపట్టలేదు.
ఏకొల్లు ప్రైమరీ బడి: ఏదీ వాడడం లేదు!
దొరవారిసత్రం, ఆంధ్రజ్యోతి: దొరవారిసత్రం మండలం ఏకొల్లు గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో నాడు-నేడు కింద అన్ని వసతులూ కలల్పించారు. కానీ దేన్నీ వాడడం లేదు. వంట గది, మరుగుదొడ్లు కూడా కట్టించారు. అయితే నీటి కొరతతో వినియోగించలేక వాటికి తాళాలు వేశారు. ఆర్వో ఫిల్టర్ సిస్టమ్ వున్నా వాడకుండా మూలన పడేశారు. ఫర్నిచర్ వున్నా పిల్లలు నేలపైనే కూర్చుని చదువుకుంటున్నారు. స్మార్ట్ టీవీ కూడా వుంది. కానీ వాడడం లేదు. గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నిచర్ అంతా ఓ గదిలో మూలన పడేశారు. ప్రహరీ ఒక వైపు కట్టలేదు. గోడలపై పెయింటింగ్ చేయలేదు.
చంద్రగిరి బాలుర హైస్కూల్: రెండు రెక్కల ఫ్యాను
చంద్రగిరి, ఆంధ్రజ్యోతి: చంద్రగిరి జడ్పీ బాలుర హైస్కూల్లో తరగతి గదులకు కిటికీలు పగిలిపోయి వున్నాయి. విద్యార్థులకు డెస్కులు, టీచర్లకు కుర్చీల కొరత వుంది. ల్యాబ్‌లో నాలుగేళ్ళుగా పరికరాలు
లేవు. గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీ ఏర్పాటు కాలేదు. ఓ తరగతి గదిలో ఫ్యానుకు రెక్క విరిగిపోవడంతో రెండు రెక్కలతో కనిపిస్తోంది. అక్కడే జడ్పీ బాలికల హైస్కూలులో ఉపాధ్యాయుల గది పైకప్పు పూర్తిగా దెబ్బతిని వర్షాలకు ఉరుస్తోంది. సభా వేదిక సైతం వర్షాలకు ఉరుస్తోంది. అదనపు తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. వంట గది లేదు.
ఇలా ఉన్నాయి బడులు..
జిల్లాలో సైతం రెండు విడతల్లో 1800 పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం అరకొర నిధులతో ఉపాధ్యాయుల గొంతుపై కూర్చుని పనులు మొదలు పెట్టించింది. ఆపై నిధుల కొరత, నిర్లక్ష్యాలతో అర్ధాంతరంగా పనులు నిలిపేసింది. అటు పనులూ పూర్తి కాకపోగా, ఇటు పనులు చేపట్టిన ఉపాధ్యాయుల చేతి చమురు కూడా వదిలింది.
వడమాలపేట మండలం సీతారామాపురం హైస్కూలులో అర్థాంతరంగా ఆగిన అదనపు తరగతి గదుల నిర్మాణం
పుత్తూరు మండలం పిళ్ళారిపట్టులో అర్థాంతరంగా ఆగిన అదనపు తరగతి గదుల నిర్మాణం.
వడమాలపేట మండలం పాదిరేడు యూపీ స్కూలులో పనిచేయని ఆర్వో ప్లాంటు.