Share News

AP Govt : మిర్చి పూచీ మాదే

ABN , Publish Date - Feb 23 , 2025 | 03:19 AM

మిర్చి ధర రూ.11,781 కన్నా తక్కువ ఉంటే మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం కింద కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

AP Govt : మిర్చి పూచీ మాదే

  • క్వింటా రూ.11,781 తగ్గితే కేంద్రంతో కొనిపిస్తాం: సీఎం

  • రైతుల రక్షణకు సిద్ధంగా ఉన్నాం

  • కోల్డ్‌ స్టోరేజీల్లోని మిర్చికి బ్యాంక్‌ రుణాలు

  • కృష్ణపట్నం పోర్ట్‌ ద్వారా కంటైనర్ల రవాణా

  • రైతులు, ఎగుమతిదారులకు సీఎం హామీ

  • 4 గంటలపాటు అన్ని అంశాలపైనా చర్చ

అమరావతి, గుంటూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): క్వింటా మిర్చి ధర రూ.11,781 కన్నా తక్కువ ఉంటే మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం కింద కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకు రుణాలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్‌ ద్వారా మిర్చి కంటైనర్ల రవాణాకు అనుమతిస్తామని చెప్పారు. పల్నాడు జిల్లాలోని స్పైసెస్‌ పార్కుకు మౌలిక వసతులు కల్పిస్తామని, గుంటూరు మిర్చి యార్డులో లారీ యజమానుల తీరుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ-క్రాఫ్‌ లో నమోదు అయిన రైతుల వివరాలు లేదా యార్డులో పంట అమ్ముకున్న వివరాల ఆధారంగా సాయం చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చెప్పారు. మిర్చి ధరల తగ్గుదల, కేంద్రం జోక్యం వంటి అంశాలపై శనివారం అమరావతి సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ భేటీలో వారి సమస్యలు, అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా క్వింటా లెక్కన బోనస్‌ ఇవ్వాలని సీఎంను వారు కోరారు. రైతుకు ఏ విధంగా సాయం చేస్తే నేరుగా అందుతుందో ఆలోచన చేసి తనకు నివేదించాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.


ఎగుమతులకు అనుమతించండి: వ్యాపారులు

కృష్ణపట్నం పోర్టు నుంచి చైనా బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేసియా దేశాలకు మిర్చి ఎగుతుమలకు అనుమతించాలని ఎగుమతి దారులు కోరారు. రాష్ట్రంలో పండే మిర్చిలో 60 శాతం ఎగుమతి చేస్తున్నామని చెప్పారు 410 మంది ప్రధాన ఎగుమతి దారులలో ప్రస్తుతం 250 మందే చురుగ్గా ఉన్నారని తెలిపారు. కృష్ణపట్నం నుంచి రవాణాకు అవకాశం లేకపోవడంతో చెన్నై పోర్టు నుంచి ఎగుమతి చేయాల్సి వస్తోందని, దానివల్ల ఖర్చులు పెరుగుతున్నాయని సీఎంకు వివరించారు. కోల్డ్‌ స్టోరేజీలలో మిర్చి నిల్వలు ఎక్కువైనప్పుడు యార్డుకు తెస్తున్నారని, డిమాండ్‌ మేరకు రైతులకు ధర ఇస్తున్నామని వ్యాపారులు చెప్పారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, మిర్చి ధర తగ్గి రైతులు ఇబ్బంది పడకుండా చూడటమేప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ధరల తగ్గుదలపై కేంద్రానికి మూడు లేఖలు రాశానని, రైతులను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, ఎగమతి దారులు సహకరించాలని కోరారు.


ఆ లారీ యజమానులపై చర్యలు

మిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేస్తున్న లారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రవాణా వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని రైతులను ఇబ్బంది పెడితే సహించవద్దన్నారు. మిర్చి యార్డులో ఎలక్ర్టానిక్‌ కాటాలు ఏర్పాటు చేసి తూకం వేయగానే రైతుల ఫోన్‌లకు మెసేజ్‌లు పంపాలన్నారు. కోల్డ్‌ స్టోరేజీల్లో టిక్కీలు నిల్వ చేసిన రైతులకు బాండ్లపై రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్పైసెస్‌ పార్క్‌లో మౌలిక వసతులు కల్పిస్తామని హామినిచ్చారు. తెగుళ్లు, పెట్టుబడుల తగ్గుదలకు రైతులకు సూచనలు ఇవ్వాలని వ్యవసాయ నిపుణులను సీఎం కోరారు. ధర తగ్గితేకేంద్రం 50శాతం, రాష్ట్రం 50శాతం భరించాల్సి ఉంటుందని, దానివల్ల పక్క రాష్ట్రల్లోని వ్యాపారులు ఏపీకి పంట తెచ్చి అమ్ముకునే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. దీనిపై మరోసారి కేంద్రంతో చర్చిస్తామని సీఎం చెప్పారు. గతంలోధర తగ్గినప్పుడు ఎకరాకు రూ.1,500 బోనస్‌ ఇచ్చామని, రైతులకు ఇచ్చే ప్రతి రూపాయి రైతులకే చెందాలని, మధ్యవర్తులకు కాదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మామిడి, మిర్చి బోర్డుల ఏర్పాటుపై త్వరలో చర్చిస్తామని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ , ఉద్యానవనశాఖ ఉన్నతాఽధికారులు రాజశేఖర్‌, విజయ సునీత, శ్రీనివాసులు, రైతు ప్రతినిధులు మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 03:20 AM