నిరుపయోగంగా ఉద్యోగుల హెల్త్‌కార్డులు: కేవీ శివారెడ్డి
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:04 AM
ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదని జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పేర్కొన్నారు.

విజయవాడ (ధర్నాచౌక్), ఫిబ్రవరి 16: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హెల్త్‌కార్డులు నిరర్ధకంగా పడిఉన్నాయని, వీటిపై రిఫరల్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదని జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రతినెలా తమ వంతు భాగస్వామ్యాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నా, ప్రభుత్వం నుంచి తమకు చెల్లింపులు జరగడం లేదంటూ ఆస్పత్రుల యాజమాన్యాలు వైద్యసేవలు అందించడంలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్స్ రాష్ట్ర సమావేశం గాంధీనగర్‌లోని ఎన్జీవో హోమ్‌లో ఆదివారం జరిగింది. శివారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెండింగ్‌లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రమోషన్ చానల్ ఏర్పాటుచేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ రాష్ట్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణు, ఎంఎస్ మూర్తి, ఎన్జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.