Share News

Leopard: పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన చిరుత.. ఆ తర్వాత రైతు ఏం చేశాడంటే..

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:14 PM

కడప జిల్లాలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. సింహాద్రిపురం మండలం బలపనూరు బి.కొత్తపల్లి వద్ద చిరుత మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామ శివారు ప్రాంతంలో కొన్ని రోజులుగా ఆడ, మగ చిరుతలు పిల్లలతో సహా సంచరిస్తున్నాయి.

Leopard: పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన చిరుత.. ఆ తర్వాత రైతు ఏం చేశాడంటే..
Leopard

కడప: తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) చిరుత పులులు (Leopards), పెద్దపులుల సంచారం పెరిగిపోయింది. అడవులు తగ్గిపోవడం, ఆహారం లభ్యత తగ్గడంతో ఈ వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. మరోవైపు చిరుతల సంతతి కూడా బాగా పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్న అడవి మృగాలు ఆవులు, గేదెలు వంటి పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. మనుషులపైనా దాడి చేసి గాయపరిచిన, చంపేసిన సందర్భాలు సైతం అనేకం కనిపిస్తున్నాయి. అడవి మృగాల సంచారంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల ప్రజలను వణికిపోతున్నారు.


తాజాగా కడప జిల్లాలోనూ చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. సింహాద్రిపురం (Simhadripuram) మండలం బలపనూరు బి.కొత్తపల్లి (Balapanuru Kothapalli) వద్ద చిరుత మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామ శివారు ప్రాంతంలో కొన్ని రోజులుగా ఆడ, మగ చిరుతలు పిల్లలతో సహా సంచరిస్తున్నాయి. అయితే ఐదు రోజుల క్రితం భరత్ అనే రైతు పొలం వద్దకు అవి వచ్చాయి. ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి మగ చిరుత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం నుంచి ఆడ చిరుత, పిల్లలు తప్పించుకున్నాయి. అనంతరం గంటల తరబడి అక్కడే అరుస్తూ ఉండిపోయాయి. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. అయితే పొలం వద్దకు వెళ్లి రైతు.. చిరుతను చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.


మెుదట దాని వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోయాడు రైతు భరత్. చాలాసేపైనా అది కదలకపోవడంతో మెల్లిగా దాని వద్దకు వెళ్లి చూశాడు. చిరుత చనిపోవడాన్ని గుర్తించి భయంతో లింగాల మండలం రామాపురం గుట్టల్లో దాన్ని పూడ్చి పెట్టాడు. అయితే ఐదు రోజుల తర్వాత విషయం కాస్త అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు హుటాహుటిన రైతు వద్దకు వెళ్లారు. అనంతరం అతన్ని తీసుకుని చిరుతను పూడ్చిపెట్టిన ప్రాంతం వద్దకు వెళ్లారు. చిరుత కళేబరాన్ని వెలికి తీశారు. ఆడ చిరుత, పిల్లలు తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

AP High Court: విజయసాయి కుమార్తెకు హైకోర్టు షాక్

Jammalamadugu: కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

Updated Date - Feb 05 , 2025 | 05:15 PM