YS Sharmila: ఏసీబీని రంగంలోకి దించండి.. నిజాలు నిగ్గు తేల్చండి
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:45 PM
YS Sharmila: ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువని.. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యారని వైఎస్ షర్మిల విమర్శించారు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందన్నారు.

విజయవాడ, జనవరి 23: ముఖ్యమంత్రి చంద్రబాబుపై (AP CM Chandrababu Naidu) మరోసారి విరుచుకుపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy). గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘అదానీపై చర్యలకు తీసుకునేందుకు చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాట.. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్ళారని ప్రశ్నించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని అడిగారు.
అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారని.. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువని.. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని తెలిపారు. ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు గారు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లే అంటూ మండిపడ్డారు.
Hyderabad: మాధవి కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు ఏం చెప్పారంటే..
అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారన్నారు. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీని కూడా రంగంలోకి దించకపోవడం అదానీని కాపాడుతున్నారు అనే దానికి నిదర్శనమన్నారు. అదానీపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజమన్నారు. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో విషయాన్ని పక్కదారి పట్టించారనేది వాస్తవమన్నారు. ‘‘అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయండి. అదానీ వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించండి. నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చండి’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Lokesh Birthday: లోకేష్‌కు శుభాకాంక్షల వెల్లువ
Mayor Vs Commissioner: గుంటూరు నగర పాలక సంస్థలో ఏం జరుగుతోంది...
Read Latest AP News And Telugu News