Vamsi into custody: మూడు రోజుల కస్టడీకి వంశీ.. ప్రశ్నలు సిద్ధం చేసుకున్న పోలీసులు
ABN , Publish Date - Feb 25 , 2025 | 11:48 AM
Vamsi Case: విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వంశీని విచారించేందుకు ఇప్పటికే పలు ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో వంశీ ఎలాంటి సమాధానాలు చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.

విజయవాడ, ఫిబ్రవరి 25: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Former MLA Vallabhaneni Vamsi) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసులో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని నేరుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల కోసం వల్లభనేని వంశీని ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం విజయవాడ కృష్ణలంక పోలీస్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యేను తీసుకెళ్లే అవకాశం ఉంది. వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్‌లను కాప్స్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని కూడా మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. వంశీని విచారించేందుకు ఇప్పటికే పలు ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు పోలీసులు. పోలీసులు సేకరించిన ఆధారాలు, విచారణలో వెల్లడైన విషయాలను బట్టి వివిధ కోణంలో వంశీని ప్రశ్నించి సమాధానాలు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విచారిస్తున్న సమయంలో రోజుకు నాలుగు సార్లు వంశీ తరపు న్యాయవాదులు కలిసేందుకు కూడా కోర్టు అనుమతించింది.
రిమాండ్ పొడిగింపు..
మరోవైపు ఈ కేసుకు సంబంధించి నేటితో వంశీ రిమాండ్ ముగిసింది. దీంతో వంశీని జైలు నుంచే వర్చువల్‌గా మెజిస్ట్రేట్ ముందు అధికారులు హాజరుపర్చారు. వంశీ రిమాండ్ మార్చి 11 వరకు పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. మొత్తం 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. అయితే మూడు రోజుల కస్టడీలో వంశీ నుంచి సరైన సమాధానాలు రాని పక్షంలో మరోసారి కస్టడీ పిటిషన్ వేసి విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నడుము నొప్పి కారణంగా జైలులో కొన్ని సౌకర్యాలు కల్పించాలని వంశీ తరపు న్యాయవాదులు కోరగా.. అందుకు న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, మంచం సదుపాయాలు కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి...
మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!
ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..
Read Latest AP News And Telugu News