MLC Election Result: పీడీఎఫ్ అభ్యర్థిపై వైసీపీ ఎఫెక్ట్.. గెలవాల్సిన చోట ఘోర పరాజయం
ABN , Publish Date - Mar 04 , 2025 | 07:52 AM
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. వైసీపీ మద్దతు తెలిపిన పీడీఎఫ్ అభ్యర్థులు ఘోర పరాజయం చవిచూశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలకు జరిగిన శాసనమండలి ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన వైసీపీ.. ఆ పార్టీ తరపున అభ్యర్థిని పోటీకి పెట్టలేదు. కానీ కూటమి అభ్యర్థుల ఓటమికోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నించిందనే ప్రచారం జరిగింది. మూడు స్థానాల్లో వైసీపీ పరోక్షంగా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిందనే ప్రచారం జరిగింది. పీడీఎఫ్ అభ్యర్థుల తరపున వైసీపీ నాయకులు ప్రచారం నిర్వహించారట. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు కోసం వైసీపీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారనే చర్చ జరిగింది. వైసీపీ మద్దతు తెలిపిన ముగ్గురు అభ్యర్థులు ఘోర పరాజయం చవిచూశారు. తమ తరపున వైసీపీ ప్రచారం చేయకుండా ఉంటే ఫలితం మరోలా ఉండేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తుందంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు. చివరకు వైసీపీపై యువత ఇంకా కోపంగానే ఉన్నారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో ఉన్న కెఎస్ లక్ష్మణరావు ఓడిపోవడానికి వైసీపీనే కారణమనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఎఫెక్ట్
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పీడీఎఫ్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావును బలపర్చాయి. వైసీపీ పోటీకి దూరంగా ఉండటంతో పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలిపింది. వాస్తవానికి కెఎస్ లక్ష్మణరావు బలమైన అభ్యర్థి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆయన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సుపరిచితులు. పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వడంతో కృష్ణా, గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీగా ఒకసారి, పట్టభద్రుల స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత లక్ష్మణరావుకు నష్టం కలిగించిందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రచారం కారణంగా కూటమి అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఘన విజయం సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు.
ఉత్తరాంధ్రలో మూడో స్థానం
ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ మద్దతు తెలిపిన పీడీఎఫ్ అభ్యర్థి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ కూటమి తరపున అధికారికంగా అభ్యర్థిని పోటీకి పెట్టలేదు. కానీ ఇద్దరు అభ్యర్థులకు కూటమి పార్టీలు తమ మద్దతు తెలిపాయి. టీడీపీ, జనసేన సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు మద్దతు తెలపగా.. బీజేపీ గాదె శ్రీనివాసులు నాయుడుకు పరోక్షంగా మద్దతు తెలిపింది. కూటమి పార్టీల్లో ఒకటైన బీజేపీ మద్దతు ప్రకటించిన అభ్యర్థి గెలుపొందినప్పటికీ వైసీపీ మాత్రం కూటమికి బిగ్ షాక్ అంటూ ప్రచారం చేస్తోంది. వైసీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూశారనే విషయాన్ని పక్కకు పెట్టి కూటమికి షాక్ వైసీపీ ప్రచారం చేస్తోంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఓడిపోవడంతో ఆ పార్టీపై ప్రజలు ఇంకా అసంతృప్తితో ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here