Share News

KS Lakshman Rao : ఓటమి భయంతో కూటమి నేతల అక్రమాలు

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:29 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని, అనేకచోట్ల పీడీఎఫ్‌ తరఫున ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు.

KS Lakshman Rao : ఓటమి భయంతో కూటమి నేతల అక్రమాలు

  • అధికార దుర్వినియోగం, బూత్‌ల ఆక్రమణ

  • పలుచోట్ల పీడీఎఫ్‌ ఏజెంట్లను తరిమేశారు

  • భారీగా దొంగ ఓట్లు.. సీఈవోకు ఫిర్యాదు చేస్తాం

  • పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు

గుంటూరు(విద్య), ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని, అనేకచోట్ల పీడీఎఫ్‌ తరఫున ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు. గుంటూరు యూటీఎఫ్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ, దుర్గి తదితర ప్రాంతాల్లో కూటమి నేతలు పీడీఎఫ్‌ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల నుంచి తరిమేశారని, కొన్నిచోట్ల ఎదురు కేసులు పెట్టించారని అన్నారు. అధికార పార్టీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఇలాంటి అక్రమాలకు తెరతీశారన్నారు. తెనాలి, పెదకూరపాడు, అమరావతి, తదితర ప్రాంతాల్లో భారీగా ఓటింగ్‌ జరిగిందని, కొన్నిచోట్ల 90 శాతం ఓటింగ్‌ నమోదయిందని.. దీనికి కారణం దొంగ ఓట్లు పోల్‌ కావడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలోని ఆర్‌విఎస్‌ స్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో పీడీఎఫ్‌ ఏజెంట్‌పై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించారని అన్నారు. కూటమి అభ్యర్థులు పోలింగ్‌ బూత్‌ల సమీపంలో టెంట్లు వేసుకుని స్లిప్‌లు పంచే నెపంతో వందల సంఖ్యలో చేరి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని, పీడీఎఫ్‌ తరఫున ఉన్న టెంట్లు తొలగించి దౌర్జన్యం చేశారని లక్ష్మణరావు ఆరోపించారు.

Updated Date - Feb 28 , 2025 | 04:29 AM

News Hub