Share News

AP Police : గన్నవరాన్ని గుల్ల చేసేశారు

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:50 AM

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుయాయుల పేరిట జరిగిన అరాచకాలు, అక్రమాలు అన్నీ, ఇన్నీ కావు....

AP Police : గన్నవరాన్ని గుల్ల చేసేశారు

  • ఐదేళ్లూ వంశీ, అనుచరుల అరాచకకాండ

  • అక్రమ మైనింగ్‌తో కోట్లు లూటీ

  • కొండలు పిండి.. చెరువులు చెర

  • టీడీపీ నేతలు, సానుభూతిపరులపై దాడులు.. వారి ఆస్తుల ధ్వంసం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుయాయుల పేరిట జరిగిన అరాచకాలు, అక్రమాలు అన్నీ, ఇన్నీ కావు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్‌ మండలాల పరిధిలో అక్రమ మైనింగ్‌, భూ కబ్జాలు, దందాలు, బెదిరింపులు, మోసాలు.. ఇలా చెప్పుకొంటూ పోతే చాంతాడంత ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో కొండలు, చెరువులు, మామిడి తోటలు, పేదల భూములు.. ఇలా అన్నింటినీ చెరబట్టి అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు సాగించారు. వంశీ అనుచరుల పేరిట సాగిన దోపిడీలో అక్రమ మైనింగ్‌ ప్రధానమైనది. అప్పటి రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులను చేతుల్లోకి తీసుకుని వారికి కూడా వాటాలు పంచుతూ కోట్లాది రూపాయల మైనింగ్‌ దోపిడీకి పాల్పడ్డారు. పగలు, రాత్రి 24 గంటల పాటు షిఫ్టుల పద్ధతిలో అక్రమ మైనింగ్‌ జరిపి లక్షలాది క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌, మట్టిని తరలించుకుపోయారు. పేదల భూములను చెరబట్టారు. ప్రైవేటు వ్యక్తుల భూములను కబ్జా చేశారు. ఇలా ఐదేళ్ల పాటు గన్నవరం నియోజకవర్గంలో అంతులేని అరాచకకాండను సాగించారు. కూటమి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయటంతో ఈ అక్రమాలపై లోతైన విచారణ జరగనుంది.


అక్రమ క్వారీయింగ్‌...

కొండపావులూరులోని సర్వే నెంబర్‌ 6లో పేదలకు ఇళ్ల పేరిట విజయవాడ నగరంలోని 5 వేల మందికి ఇళ్ల పట్టాలను కేటాయించగా... ఇందులో ఉన్న సూదిగట్టు, గదబాలగట్టు, గుర్రం గట్టు, పాత గట్టు నాలుగు కొండలకు గుండుకొట్టి కోట్లాది రూపాయల గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోయారు. వెదురుపావులూరు, కొండపావులూరులలో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ బ్లాస్టింగ్‌లతో పిండి చేశారు. డ్రిల్లింగ్‌ మెషిన్లను తెప్పించి కొండకు ఐదారు మీటర్ల లోతున రంధ్రాలు చేసి అందులో పేలుడు పదార్థాలు నింపి భారీ ఎత్తున బ్లాస్టింగ్‌ చేశారు. సూరంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 526లోని 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోకతిప్పను కూడా వంశీ అనుయాయులు వదల్లేదు. గన్నవరం మండలం పరిధిలోనే ముస్తాబాద, చనుపల్లివారిగూడెం కొండలను కూడా అనధికారికంగా చేజిక్కించుకున్నారు. రాత్రివేళల్లో కొండలను పిండిచేశారు. లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర గ్రావెల్‌ను తన్నుకుపోయారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని సర్వే నెంబర్‌ 11లో 175 ఎకరాలను అడ్డగోలుగా తవ్వేశారు. మల్లవల్లి గ్రావెల్‌ను గుడివాడ, బందరులకు భారీ ఎత్తున తరలించారు. పోర్టు పనుల పేరుతో భారీ ఎత్తున గ్రావెల్‌ను తవ్వుకుపోయారు.


చెరువులను చెరబట్టి..

నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 80 శాతంపైగా చెరువులలో అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టారు. కొండపావులూరులోని సర్వే నెంబర్‌ 144లోని ఎర్ర చెరువు, బాపులపాడు మండలంలోని బిళ్లనపల్లి, రేమల్లెలోని ఊరచెరువు, వేలేరులోని ఊరచెరువు, ఉంగుటూరులో ఏ సీతారామపురం చెరువు, బాపులపాడు మండలంలో కానుమోలులోని 12 ఎకరాల చెరువు, ఇతర అనేక కుంటలను 150 ఎకరాలకు పైగా తవ్వేశారు. నాలుగు నియోజకవర్గాలలో మొత్తంగా 50 చెరువులకు పైగా వంశీ అనుచరులు అక్రమ తవ్వకాలు జరిపారు. పోలవరం కాలువపై రెండువైపులా గట్లపై కొండల్లా ఉన్న మట్టిని కూడా జగనన్న కాలనీల మెరక పేరుతో కొల్లగొట్టారు.

పేదల భూములు గుప్పిట్లోకి...

నియోజకవర్గంలో గ్రావెల్‌ నిక్షేపాలు కలిగిన మామిడి తోటలను కూడా వదల్లేదు. రంగన్నగూడెం, సింగన్నగూడెం గ్రామాలలోని మామిడి తోటల నేలలు గ్రావెల్‌తో కూడుకుని ఉండటంతో వంశీ అనుయాయులు వాటాల ప్రాతిపదికన చేజిక్కించుకుని గ్రావెల్‌ తవ్వేశారు. దాదాపుగా 15 మీటర్ల మేర లోతున గ్రావెల్‌ తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన సాగు పట్టాలను, ప్రజలు ఆక్రమించుకున్న భూములను నయాన, భయాన తమ గుప్పిట్లోకి తీసుకుని మట్టిని అడ్డగోలుగా తవ్వేశారు. కొండపావులూరులో సర్వే నెంబర్‌ 33, 34, 62లలో పెద్ద సంఖ్యలో భూములను లీజుకు తీసుకుని 35 మీటర్ల లోతున మట్టిని తరలించారు. మట్టిని ఇటుక బట్టీలకు భారీగా తరలించి సొమ్ము చేసుకున్నారు.


భూకబ్జాలు.. దందాలు

మల్లవల్లి పారిశ్రామికవాడకు వెళ్లే రహదారికి రేమల్లె శివారులో సర్వే నెంబర్‌ 418-8, 9ల్లోని సుమారు 22 ఎకరాల భూమిని హరిదాసులకు పట్టాలు కేటాయించారు. రెవెన్యూ అధికారుల సహకారంతో వంశీ అనుయాయులు బెదిరించి ఆ భూమిని తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులో తవ్వకాలు జరిపి గ్రావెల్‌ను తరలించేశారు. ఇదే ప్రాంతంలో ఉన్న సర్వే నెంబర్‌ 422లోని 18 ఎకరాల భూమి స్థానిక ప్రజలు ఆక్ర మణలో ఉండగా వారిని భయపెట్టి చేతుల్లోకి తీసుకున్నారు. ఈ భూముల విలువ రూ.50 కోట్ల మేర విలువ ఉండగా, తరలించిన గ్రావెల్‌ విలువే రూ.17 కోట్లు ఉంటుందని అంచనా!

కోడూరుపాడులోని శ్రీకోదండ రామస్వామి ఆలయానికి 1968లో వెలమదొరలు సర్వే నెంబర్‌ 111-1లో ఎకరం భూమి దానంగా దేవస్థాన అభివృద్ధి కోసం ఇచ్చారు. ఆ భూమిని కూడా వదలకుండా బినామీ పేర్లతో దక్కించుకున్నారు. మల్లవల్లిలో 3 ఎకరాల అసైన్డ్‌ భూమిని తమ అధీనంలోకి తీసుకుని తవ్వకాలు జరిపారు. మల్లవల్లిలో 2014లో వేసిన సాయితేజ ఇన్‌ఫ్రా హైలెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెంచర్‌లో పలువురు ప్లాట్లు కొన్నారు. ఆ భూములను కూడా వంశీ అనుయాయులు చెరబట్టి తమకు అమ్మినట్టుగా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. అంపాపురంలో సర్వే నెంబరు 109-3లో పేద రైతుల సాగులో ఉన్న 14 ఎకరాల భూములను సాగు చేయకూడదని హెచ్చరిక బోర్డు పెట్టి ఖాళీ చేయించారు. తిరిగి బినామీల పేర్లతో పట్టాలను పుట్టించి వాటిని జగనన్న కాలనీల కోసం అమ్మకానికి పెట్టారు. చివర్లో అది ఫలించలేదు. రేమల్లెలో సర్వే నెంబరు 422-8,9లో 20 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో సాగు చేసుకుంటున్న సన్నకారు రైతులను బెదిరించి ఆక్రమించుకోవడంతో పాటు 20 అడుగులకు పైగా అక్రమ మైనింగ్‌ చేశారు. రేమల్లె గ్రామంలోనే హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి పోలవరం గట్టున ఉన్న 3ఎకరాల భూమిలో లేఅవుట్‌ వేస్తున్న విషయం తెలుసుకుని స్థానిక నాయకులతో కలిసి 26 సెంట్ల కామన్‌సైట్‌ భూమిని మండల స్థాయి వైసీపీ నాయకుడి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. తర్వాత వంశీ అనుయాయులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.


బెదిరింపుల పర్వం

వంశీ, ఆయన అనుచరులు నియోజకవర్గంలో ఎంతోమందిని వేధించారు. తన గెలుపునకు కృషి చేసిన టీడీపీ నాయకులను తనతో పాటు వైసీపీలో చేరాలని వంశీ అల్టిమేటం జారీ చేశారు. బాపులపాడు మండలంలోని నాయకులు అడ్డం తిరగడంతో వారి ఆస్తులను ధ్వంసం చేసేందుకు అధికారులతో కలిసి భయోత్పాతం సృష్టించారు. తిప్పనగుంటకు చెందిన పీఎసీఎస్‌ మాజీ అధ్యక్షుడు మాదాల శ్రీనివాసరావు ఎరువుల దుకాణాన్ని ఆర్ధరాత్రి నేలమట్టం చేయించారు. దీనికి అప్పటి తహసీల్దార్‌ నరసింహారావుతో పాటు రెవెన్యూ సిబ్బందిసహకారం అందించారు. రేమల్లెకు చెందిన తుమ్మల ఉదయ్‌ను వైసీపీలోకి చేరాలని ఒత్తిడి చేసినా లొంగకపోవడంతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీస్‌ స్టేషన్‌ తీసుకువెళ్లి బెదిరించారు. అయినా లొంగకపోవటంతో అతను సాగు చేసుకుంటున్న 13 ఎకరాల రొయ్యల చెరువుకు గండ్లు పెట్టించారు. ఇలా ఎన్నో దాడులు చేయించారు. విజయవాడ మధురానగర్‌కు చెందిన సుంకర సీతామహలక్ష్మి తాను గన్నవరంలో కొనుగోలు చేసిన సర్వే నెంబర్‌ 477-2లో 484 చదరపు గజాల స్థలాన్ని వల్లభనేని వంశీ ప్రోద్బలంతో ఆక్రమించుకున్నట్లు జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. అలాగే సూరంపల్లి గ్రామానికి చెందిన గొట్టిపూళ్ల్ల రఘనాథ్‌ సర్వే నెంబర్‌ 366లోని 5.77 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదు చేశారు.


అడ్డగోలుగా తవ్వకాలు

మల్లవల్లి పారిశ్రామికవాడలో చదును చేస్తున్నామనే పేరుతో కన్‌స్ట్రక్షన్‌ వారిని అడ్డుపెట్టుకుని 100ఎకరాలకు పైగా భూమిలో అక్రమంగా తవ్వకాలు జరిపారు. కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్‌ను పోర్టు అభివృద్ధి పనుల పేరిట తరలించేశారు. మట్టి మాఫియా అయితే వేలేరు, కొత్తపల్లి, రంగన్నగూడెం, తదితర గ్రామాల్లో చెరువులను చెరపట్టి దోచుకోవడమే పనిగా అక్రమ తవ్వకాలు నిర్వహించారు. బాపులపాడు మండలంలోనే సుమారు 200 ఎకరాల వరకూ అక్రమ తవ్వకాలతో గోతులు పడి ఉన్నాయి. బాపులపాడు మండలానికి తహసీల్దార్‌గా రావడానికే అధికారులు భయపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే అదనుగా గన్నవరం తహసీల్దార్‌గా పనిచేసిన నరసింహారావు (బాపులపాడు మండలంలో కూడా పని చేశారు) ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ పనులను చక్కబెట్టారు.

Updated Date - Feb 25 , 2025 | 03:50 AM