rims: సిబ్బంది కొరత.. పరికరాలు వృథా..
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:13 AM
rims: ఆ ఆస్పత్రి జిల్లాకే కీలకమైనది. తమ ప్రాణాలు నిలుస్తాయని ఆశతో రోగులు, ఉత్తమ చికిత్స, వసతులు అందుబాటులో ఉంటాయని వైద్యులు ఇక్కడకే కేసులు రిఫర్ చేస్తుంటారు. పేరుకే అది పెద్దాసుపత్రి అయినా సేవలు మాత్రం ఆ స్థాయిలో అందడం లేదు.

- శవాగారంలో ఫ్రీజర్లూ లేవు
- 900 పడకలకు రెండే అంబులెన్స్‌లు
- ఇదీ శ్రీకాకుళం రిమ్స్‌లో పరిస్థితి
ఆ ఆస్పత్రి జిల్లాకే కీలకమైనది. తమ ప్రాణాలు నిలుస్తాయని ఆశతో రోగులు, ఉత్తమ చికిత్స, వసతులు అందుబాటులో ఉంటాయని వైద్యులు ఇక్కడకే కేసులు రిఫర్ చేస్తుంటారు. పేరుకే అది పెద్దాసుపత్రి అయినా సేవలు మాత్రం ఆ స్థాయిలో అందడం లేదు. ఇక్కడ అడుగడుగునా సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఒకపక్క సిబ్బంది కొరత, మరోపక్క వృథాగా పడిఉన్న పరికరాలతో రోగులకు అరకొరగా సేవలు అందుతున్నాయి. మార్చురీలో ఫ్రీజర్లు లేక మృతదేహాలకు పురుగులు పడుతున్నాయి. అంబులెన్స్‌లు, వీల్‌చైర్లు, స్ర్టెచర్లు, మరుగుదొడ్లు..ఇలా అన్నీ కొరతే. ఇదీ శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్) పరిస్థితి.
అరసవల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో సమస్యలు తిష్ఠవేశాయి. 900 పడకలు గల ఈ ఆసుపత్రిలో 32 వార్డులు, 8 ఐసీయూలు ఉన్నాయి. ఒక్కో వార్డులో రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు గాను కనీసం ముగ్గురు, ఐసీయూలో పని చేసేందుకు ఆరుగురు చొప్పున వైద్య సిబ్బంది ఉండాలి.
మొత్తం 32 వార్డులకు గాను కనీసం 96 మంది, 8 ఐసీయూలకు 48 మంది ఎంఎన్‌వోలు అవసరం. కానీ, ఆసుపత్రి మొత్తానికి కేవలం 28 ఎంఎన్‌వోలు మాత్రమే ఉన్నారు. 116 మంది సిబ్బంది కొరత. కేవలం 28 మందితోనే అత్యున్నత సేవలు ఎలా అందిస్తారో అర్థంకావడం లేదు. అలాగే, ఆసుపత్రిలో 14 విభాగాలు ఉండగా 8 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే ఉన్నారు. వీరంతా సూపరిం టెండెంట్ ఆఫీసులోనే పని చేస్తున్నారు. మిగిలిన విభాగాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఇతర ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. విభాగానికి ఒకరు చొప్పున 14 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తే పూర్తి స్థాయిలో సేవలందించేందుకు అవకాశం ఉంటుంది.
మూలకు చేరిన పరికరాలు..
కొవిడ్ సమయంలో రిమ్స్‌కు పెద్ద ఎత్తున వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. కొవిడ్ అనంతరం వాటి వినియోగం పూర్తిగా తగ్గిపోవడంతో ఆ పరికరాలను మూలన పడేశారు. దాంతో అవన్నీ ఇప్పుడు పనిచేయని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి మొత్తానికి పూర్తి సామర్థ్యంతో కేవలం 8 నుంచి 10 వెంటిలేటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మరో 80 పరికరాలు నిరంతరం బాగు చేయడం, మరమ్మతులకు గురవడం జరుగుతోంది. ఆసుపత్రికి కనీసం 50 వెంటిలేటర్లు అవసరం ఉంది.
ఆక్సిజన్ ప్లాంట్లలో మూడు నిరుపయోగంగా ఉన్నాయి. 8 కొత్త ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కనీసం వాడకుండా మూలన పడేశారు. మరో 37 కాన్సంట్రేటర్లు కూడా వృథాగా ఉన్నాయి. వీల్ చైర్లు, స్ట్రెచర్లకు కూడా కొరత ఉంది. 900 పడకల ఆసుపత్రిలో రెండు అంబులెన్స్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోగులను తీసుకువచ్చేందుకు, తరలించేందుకు ఇవి సరిపోవడం లేదు. మరో రెండు అంబులెన్స్‌లను కేటాయించాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్న అంబులెన్స్‌లు పూర్తిగా మూలకు చేరాయి.
శవాలకు పురుగులు..
ఆసుపత్రి శవాగారంలో ఫ్రీజర్లు పనిచేయడం లేదు. మృతదేహాలను భద్రపరిచేందుకు ఎటువంటి సదుపాయం లేకపోవడంతో, అనాథ శవాలు, లేదా గుర్తింపు లేని శవాలకు పురుగులు పడుతున్నాయి. మార్చురీలోకి వెళ్లేందుకు కూడా మృతుల బంధువులు, స్నేహితులు భయపడుతున్నారు. ఇటీవల 6 బాడీ ఫ్రీజర్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చారు. మరో రెండు ఫ్రీజర్లు పనిచేయడం లేదు. వీటిని అందుబాటులో ఉంచితే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
మరుగుదొడ్లు లేవు..
ఆసుపత్రికి అనుబంధంగా కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వ, ప్రజా, ప్రైవేటు విధానంలో నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్లలో మరుగుదొడ్లు లేవు. 2016 నుంచి నడుస్తున్న ఈ సెంటర్లలో వాడుక నీరు బయటకు వెళ్లేందుకు పైప్‌లైన్ కూడా లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకు కనీసం 40 నుంచి 50 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఈ సెంటర్లలో డయాలసిస్ చేయించుకుంటుంటారు. ఇప్పటికైనా జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
ఈ పరికరాలను అందుబాటులోకి తేవాలి
ఆసుపత్రిలో డీఆర్ ఎక్స్‌రే మిషన్ ఒక్కటి మాత్రమే ఉంది. మరో మిషన్ అందుబాటులోకి తెస్తే రోగులకు నిమిషాల్లో సేవలందించేందుకు వీలుంటుంది. గర్భిణులకు అత్యున్నత సేవలందించేందుకు అవసరమైన టిఫా స్కాన్ ఇక్కడ లేదు. ఈ సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులపై పైనే ఆధారపడే పరిస్థితి నెల కొంది. స్త్రీలలో కేన్సర్‌ని గుర్తించేందుకు గాను మామ్మోగ్రామ్‌ను అందుబాటులోకి తేవాలి. ఈ పరికరం అందుబాటులో ఉంటే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి, వారి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే యాక్సిడెంట్, డెంటల్ కేసుల్లో సత్వర గుర్తింపు కోసం ఓఆర్ డెంటల్ ఎక్స్‌రే పరికరాన్ని కూడా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.