Kakinada: తునిలో వైసీపీకి షాక్!
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:54 AM
మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మరో ఆరుగురు సోమవారం టీడీపీలో చేరిపోయారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా
టీడీపీలోకి వైస్‌చైర్మన్ సహా మరో ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు
తుని రూరల్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మరో ఆరుగురు సోమవారం టీడీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి ఏలూరి సుధారాణి రాజీనామా చేశారు. ఇప్పటికే పది మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి రాగా, తాజాగా మరో ఆరుగురు రాకతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 16కు చేరింది. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకుగాను ఒకరు మరణించారు. మరొకరు రాజీనామా చేశారు. మిగిలిన 28 మందిలో ప్రస్తుతం 16 మంది టీడీపీలోనూ, 12 మంది వైసీపీలోనూ ఉన్నారు. తుని టీడీపీ ఎమ్మెల్యే యనమల దివ్య ఓటుహక్కుతో కలిపితే టీడీపీ మొత్తం బలం 17 అవుతుంది. దీంతో రెండో వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఒకటో వైస్‌చైర్మన్ సహా ఆరుగురు కౌన్సిలర్లకు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వారిలో కౌన్సిలర్లు సూరిశెట్టి సుభద్రాదేవి(6వ వార్డు), మంతెన నాగలక్ష్మి(8వ వార్డు), వాసంశెట్టి శ్రీను(9వ వార్డు), మొల్లేటి ప్రభావతి(10వ వార్డు), కోలా శ్రీను(21వ వార్డు), కె.రూపాదేవి(28వ వార్డు, వైస్‌చైర్మన్) ఉన్నారు. కాగా, ప్రజా శ్రేయస్సు కోరే మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టుఏలూరి సుధారాణి మీడియా సమావేశంలో చెప్పారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన తాను సాధారణ కౌన్సిలర్‌గా కొనసాగుతానని కమిషనర్‌కు తెలిపారు.