Donald Trump on Gaza : మా సహనం నశిస్తోంది..గాజా స్వాధీనం చేసుకుని తీరతాం.. ట్రంప్
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:43 AM
Donald Trump on Gaza : హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు జరుగుతున్న తీరుపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. హమాస్ విడుదల చేస్తున్న బందీలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని.. గాజాను అమెరికా స్వాధీనంలోకి తీసుకుని తీరతామని స్పష్టం చేశారు.

గాజా నుంచి హమాస్ విడుదల చేస్తున్న బందీలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని.. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. 491 రోజుల పాటు సరైన ఆహారం లేక కృశించిపోయిన వారిని చూస్తుంటే మనసు చలిపోతోందని అన్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు జరుగుతున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తపరిచారు. ఈ విషయంలో మా సహనం నశిస్తోందని.. పాలస్తీనియన్లను గాజా నుంచి ఖాళీ చేయించి ఆ ప్రదేశాన్ని తప్పక అమెరికా నియంత్రణలోకి తీసుకుని తీరతామని స్పష్టం చేశారు.
గాజాను ఆక్రమించుకుని తీరతాం.. ట్రంప్..
గాజా కారిడార్ నుంచి పాలస్తీనియన్లను తొలగించి అమెరికా నియంత్రణలోకి తెచ్చుకుంటామని కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, హమాస్ మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే మా సహనం నశిస్తోందని.. ముందుగా చెప్పినట్టుగానే గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటామని తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉంటానని అమెరికా అధ్యక్షుడు చెప్పడంతో.. ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పంద సమయాన్ని పొడిగించాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఒత్తిడి పెరుగుతోంది.
వారి పరిస్థితి చూస్తే మనసు చలించిపోతోంది..
దాదాపు 491 రోజుల పాటు తమ బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీలను ఇటీవల హమాస్ విడుదల చేసింది. విడుదలైన తర్వాత కృంగి కృశించిపోయి ఆందోళనకరంగా మారిన ఎల్ షరాబీ(52), ఒహాద్ బెన్ అమి (56), ఓర్ లెవీల పరిస్థితి చూసి ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది. గతంలో, ఇప్పటి ఫోటోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నెలల తరబడి ఆహారం లభించక దీన స్థితిలో గడిపిన వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని.. హోలోకాస్ట్ బాధితుల్లా బందీలు కనిపిస్తున్నారని అన్నారు. ఇక మా సహనం నశిస్తోందని.. అమెరికా పాలస్తీనా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుందనే తన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. తమ ఆధ్వర్యంలో శిథిలమైన గాజా పునర్నిర్మాణం సాధ్యమవుతుందని.. హమాస్ బలపడకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గాజా కారిడార్ నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ..
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ చర్చల రెండవ రౌండ్ ఫిబ్రవరి 3న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇజ్రాయెల్, హమాస్ మొదటి ఒప్పందం అమలులో పెద్దగా పురోగతి సాధించలేదు. తాజాగా ఇజ్రాయెల్ దళాలు ఆదివారం గాజా కారిడార్ నుండి ఉపసంహరించుకున్నాయి. ప్రధానమంత్రి నెతన్యాహు కీలక మధ్యవర్తి అయిన ఖతార్‌కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపారు. అందులో దిగువ స్థాయి అధికారులు ఉండటంతో ఈ చర్చలు సఫలం కావనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్ ‘గోల్డెన్ వీసా’లో మార్పులు
చంద్రుడిపై పది నిమిషాల విధ్వంసం!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..