Abhaya case : ‘అభయ’ మృత దేహంపై ఓ మహిళ డీఎన్‌ఏ!
ABN , Publish Date - Jan 22 , 2025 | 02:37 AM
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికో ‘అభయ’పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులోని ముద్దాయి సంజయ్ రాయ్

కోల్‌కతా, జనవరి 21: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికో ‘అభయ’పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులోని ముద్దాయి సంజయ్ రాయ్ చనిపోయే వరకు జైలులోనే ఉండాలంటూ ట్రయల్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిన విషయం విదితమే. అయితే విచారణ సందర్భంగా సమర్పించిన కొన్ని నివేదికల ద్వారా మరికొంత ఆసక్తికర సమాచారం వెల్లడయింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్పించిన నివేదికను పరిశీలించినప్పుడు అత్యాచారానికి గురయిన ఆ యువ వైద్యురాలి మృతదేహంపై సంజయ్‌రాయ్ డీఎన్‌ఏ 100 శాతం మేర ఉన్నట్టు గుర్తించారు. అయితే కొద్ది శాతం మేర మరో మహిళ డీఎన్‌ఏ కూడా ఉన్నట్టు తేలింది. ఇది పొరపాటున సంజయ్‌రాయ్ డీఎన్‌ఏలో కలిసిందా, లేదంటే ఆమెకు కూడా ఏమైనా ప్రమేయం ఉందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ముద్దాయి సంజయ్ రాయ్ చనిపోయే వరకు జైలులోనే ఉండాలని ట్రయల్ కోర్టు సోమవారం తీర్పు ఇవ్వగా, దానిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరణశిక్ష విధించి ఉంటే బాగుండేదని, తీర్పుపై అప్పీలు చేస్తామని తెలిపారు. దాంతో తీర్పు వచ్చి 24 గంటలు గడవకముందే అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా మంగళవారం ఉదయమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.