Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:08 PM
దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల వరకూ దాదాపు 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్రతి 200 మీటర్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఓటు వేయడానికి ఎలా వస్తారు? అని ఆరోపణలు చేసారు.

Delhi Elections 2025 Voting : ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఒకే విడతలో జరగనున్న ఈ పోలింగ్‌లో అన్ని నియోజకవర్గాల్లో కలిపి వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం ఆతిషీ సహా అనేక మంది ప్రముఖ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఉదయం 11 గంటల వరకూ దాదాపు 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అటువంటి పరిస్థితిలో గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థి మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు.
పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల దూరంలో బారికేడ్లు..
ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ బుధవారం మాట్లాడుతూ, ఆప్ బలంగా ఉన్న ప్రాంతాలలో పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల దూరంలో ఢిల్లీ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇలా అడుగడునా బారికేడ్లు ఏర్పాటు చేస్తే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు.
ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి..
ఎక్స్ వేదికగా ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇలా రాశారు. 'ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇది చిరాగ్ ఢిల్లీ పోలింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు. బైక్‌లు, స్కూటర్లు, కార్లను అనుమతించరు. ప్రజలు ఎలా ఓటు వేస్తారు? వృద్ధులు, వికలాంగులు ఓటు వేయడానికి 200 మీటర్లు నడిచి వస్తారా? ఇది ఏ చట్టం లేదా నియమం ప్రకారం జరుగుతుందో ఎన్నికల సంఘం మరియు ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెప్పాలి?' అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..