Delhi Assembly Elections: కేజ్రీవాల్ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:00 PM
Delhi Assembly Elections: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య ప్రధాన పోరు జరగనుంది.

న్యూఢిల్లీ, జనవరి30: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తోంది. ఇక బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పాలనకు గండికొట్టి.. ఢిల్లీ అధికార పీఠాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది.
అలాంటి వేళ.. ఈ ఇరు పార్టీల మధ్య యమునా నది అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల వేళ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే యమునా నదిని క్లీన్ చేస్తామంటూ ఢిల్లీ నగర ప్రజలకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత ఆ హామీని మరిచిపోయారు.
అయితే మళ్లీ ఎన్నికల నగారా మోగడంతో గతంలో ఇచ్చిన ఈ హామీ మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌కు గుర్తుకు వచ్చింది. దీంతో ఆ హామీని మళ్లీ ఆయనే తెరపైకి తీసుకు వచ్చారు. దీనిని రాజకీయ లబ్ది కోసం వాడుకుని ఎన్నికల్లో గెలవాలని ఆయన ఆశించారు. అందులోభాగంగా బీజేపీని ఇరుకున పెట్టాలనుకున్నారు. కానీ ఆయన ఇరుకున పడిపోయారనే ఆ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
హరియాణా నుంచి ఢిల్లీ మీదుగా యమునా నది ప్రవహిస్తోందన్నారు. దీంతో హరియాణ పరిశ్రమల్లోని వ్యర్థాలను యమనా నదిలో కలుపుతోన్నారంటూ కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు.
సీఎం అతిషి కీలక ఆరోపణలు
ఇది పక్కా వాస్తవమంటూ ఢిల్లీ సీఎం అతిషి స్పష్టం చేశారు. అంతేకాదు..ఈ నీటిలో అమ్మోనియా శాతం అధికంగా ఉందన్నారు. ఈ నీటిని శుద్ధి చేయడం చాలా కష్టతరమని ఆమె పేర్కొ్న్నారు. నీటిలో అమ్మోనియా స్థాయి 1 పీపీఎమ్ వరకు ఉంటే.. ఢిల్లీ జల్ బోర్డు శుభ్రం చేయగలదన్నారు. కానీ ఆ నీటిలో 700 శాతం మేర అమ్మోనియా ఉందని.. ఈ నీటిని శుభ్రం చేయడం కష్ట సాధ్యమని సీఎం అతిషి వివరించారు. ఈ నేపథ్యంలో ఈ నీటిని ప్రజలకు సరఫరా చేస్తే.. వారి ప్రాణాలకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేసి..
మరోవైపు కేజ్రీవాల్ ఒక అడుగు ముందుకు వేసి.. యమునా నదిలో హరియాణ ప్రభుత్వం విషం కలుపుతోందంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ నీరు తాగితే ఢిల్లీ ప్రజలు చాలా మంది చనిపోతారన్నారు. ఈ నీటిని శుద్ధి చేయలేని విధంగా యుమునను సదరు ప్రభుత్వం విషపూరితం చేసిందంటూ ఆరోపణలు గుప్పించారు.
ఖండించిన బీజేపీ.. హర్యానా సీఎం మండిపాటు..
ఈ ఆరోపణలపై హర్యానాలోని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ సైతం స్పందించారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ చేసిన ఈ తరహా ఆరోపణలను ఖండించారు. తమ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పరిశ్రమల వ్యర్థాలను యమునా నదిలోకి వదులుతోందంటూ ఆప్ చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
వాస్తవానికి విరుద్దంగా ఆరోపణలు గుప్పించడం కేజ్రీవాల్ నైజమంటూ హరియాణ సీఎం నాయబ్ సింగ్ సైనీ నిప్పులు చెరిగారు. ఈ తరహా ఆరోపణలు గుప్పించిన కేజ్రీవాల్.. హర్యానా ప్రజలతోపాటు ఢిల్లీ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకుంటే మాత్రం అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. దీంతో ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం వాడి వేడిగా సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా..
ఇక ఢిల్లీ పీఠం సొంతం చేసుకొనేందుకు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతోపాటు ఆ పార్టీలోని పలువురు కీలక అగ్రనేతలు సైతం ఎన్నికల ప్రచారాన్ని ప్రజల మధ్యకు వెళ్లి తమదైన శైలీలో నిర్వహిస్తున్నారు. మరోవైపు 2013 నుంచి వరుసగా ఢిల్లీ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకొంటుంది. అలాంటిది ఈ సారి ఎలాగైనా బీజేపీ వశం కావాలనే లక్ష్యంతో కమలనాథులు దూసుకు వెళ్తున్నారు.
ఎవరికి వారే విడి విడిగా..
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. దీంతో ఢిల్లీ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది ఆ రోజు సుస్పష్టం కానుంది. ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ పార్టీ, ఆప్‌లు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.
ఆప్‌కు మద్దతుగా..
మరోవైపు ఈ కూటమిలో భాగస్వామ్య పక్షమైన సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష యాదవ్‌తోపాటు ఆ పార్టీ ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇదే కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హా సైతం ఆప్‌కు మద్దతుగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
For National news And Telugu News