Delhi CM - BJP: ఢిల్లీ సీఎం ఆమేనా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:27 PM
హోరా హోరీ పోరులో హస్తినాను హస్తగతం చేసుకుంది కమలం పార్టీ. 2013 నుంచి ఢిల్లీని ఏలుతున్న ఆప్‌ను ఊడ్చేసి.. 27 ఏళ్ల తరువాత అధికారం దక్కించుకుంది. పార్టీ గెలిచినా.. ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది కమలదళం.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: హోరా హోరీ పోరులో హస్తినాను హస్తగతం చేసుకుంది కమలం పార్టీ. 2013 నుంచి ఢిల్లీని ఏలుతున్న ఆప్‌ను ఊడ్చేసి.. 27 ఏళ్ల తరువాత అధికారం దక్కించుకుంది. పార్టీ గెలిచినా.. ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది కమలదళం. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినప్పటికీ.. ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వచ్చి 11 రోజులు గడిచినా.. ఇంకా తమ సీఎం క్యాండిడేట్‌ను బీజేపీ అధిష్టానం ప్రకటించకపోవడంతో ఢిల్లీని ఏలేది ఎవరా? అనే ఆసక్తి మరింత పెరుగుతోంది. అయితే, ముఖ్యమంత్రి రేసులో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా కొందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేశారని టాక్ నడుస్తోంది. వీరిలోనూ ప్రధానంగా ఒకరి పేరు బలంగా వినిపిస్తోంది. అది కూడా మహిళా ఎమ్మెల్యే పేరు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి రేసులో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం బీజేపీ అధిష్టానమే తీసుకోనుంది. బుధవారం జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించి.. సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఆ తరువాతే అసలు పేరు బహిర్గతం కానుంది. ప్రస్తుతానికైతే.. పర్వేష్ సాహిబ్ సింగ్, ఆశిష్ సూద్, అజయ్ మహావర్, రవీంద్ర ఇంద్రరాజ్, అనిల్ గోయల్, రాజ్ కుమార్ భాటియా, రేఖ గుప్తా పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయని సమాచారం. ప్రధానంగా రేఖ గుప్తా పేరు బలంగా వినిపిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖ గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్లు పెద్ద టాక్ నడుస్తోంది. అదే జరిగితే.. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖ గుప్తు నిలుస్తారు.
ఎవరీ రేఖ గుప్తా..
బీజేపీలో క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రేఖ గుప్తా.. పార్టీలో అనేక పదవులు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, కౌన్సిలర్‌గా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ కార్యదర్శిగానూ పని చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రేఖ గుప్తా.
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రిగానా..?
రేఖ గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఎన్నో సానుకూల అంశాలు కలిసొస్తున్నాయి. పార్టీలో ఆమెకు పెద్ద పెద్ద నేతలతో పరిచయాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో పని చేసిన ఆమెకు బడా నేతల అండదండలు ఉన్నాయి. ఆ పరిచాయాలే ఆమెను సీఎంగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలోనూ మహిళా ముఖ్యమంత్రి లేరు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను నియమిస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. దాంతోపాటు.. పార్టీ కోసం రేఖ గుప్తా చాలా కష్టపడ్డారని.. ఆమె సేవలను గుర్తించాల్సిన సమయం వచ్చిందని అధినాయకత్వం నిర్ణయించిందట. ఇకపోతే.. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారినే సీఎంగా నియమించింది బీజేపీ. ఇప్పుడు ఢిల్లీలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని భావిస్తోందట. మరి అందరూ అనుకున్నట్లుగానే ఆమె పేరునే ఫైనల్ చేస్తారా? లేక మరైదేనా ట్విస్ట్ ఇస్తారా? అనేది తెలియాలంటే.. సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
ఇలా ఎన్నుకోనున్నారు..
ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బుధవారం జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎన్నుకొంటారు. బీజేపీ అధినాయకత్వం నియమించిన పరిశీలకుల సమక్షంలో సీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. ఆ తరువాత బీజేపీ నాయకులు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు చేయడానికి ప్రతిపాదనను అందజేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల జాబితాను కూడా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు అందజేశారు. ఆ తరువాత లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం తదుపరి.. ఫిబ్రవరి 20వ తేదీన రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రితో పాటు.. క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గ్రాండ్‌గా ఏర్పాట్లు..
27 సంవత్సరాల తరువాత ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాకి బీజేపీ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది. భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20వ తేదీన రాంలీలా మైదానంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలను, దౌత్యవేత్తలను ఆహ్వానించాలని భావిస్తోంది. బీజేపీ అగ్ర నాయకులు, కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నాయకులు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
Also Read:
ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్: యువీ
అక్రమ వలసదారులకు సంకెళ్లు.. మస్క్ కాంట్రవర్షియల్ రిప్లై..
దిగొచ్చిన పాక్.. భారత్‌తో అట్లుంటది
For More National News and Telugu News..