Rohit Sharma: రోహిత్ ముందు 2 గోల్స్.. ఇవి సాధించే వరకు నో రిటైర్మెంట్..
ABN , Publish Date - Jan 07 , 2025 | 02:19 PM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024తో పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ చాంపియన్ ప్లేయర్ వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే త్వరలో ఈ రెండు ఫార్మాట్లకూ అతడు గుడ్‌బై చెప్పడం ఖాయమని వినిపిస్తోంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024తో పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ చాంపియన్ ప్లేయర్ వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే త్వరలో ఈ రెండు ఫార్మాట్లకూ అతడు గుడ్‌బై చెప్పడం ఖాయమని వినిపిస్తోంది. టెస్టుల్లో దారుణమైన వైఫల్యం, జట్టు వరుస ఓటముల కారణంగా ఇటీవల సిడ్నీ టెస్ట్‌లో అతడు ఆడలేదు. ఆ ఫార్మాట్‌లో కొనసాగుతానని హిట్‌మ్యాన్ చెబుతున్నా నమ్మశక్యంగా అనిపించడం లేదు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేల నుంచీ అతడు తప్పుకుంటాడనే పుకార్లు వస్తున్నాయి. అయితే అతడి ముందు 2 గోల్స్ ఉన్నాయని.. అవి సాధించే వరకు రిటైర్ అవ్వడని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు హిట్‌మ్యాన్ లక్ష్యాలు ఏంటి? రిటైర్ అయ్యేలోపు వాటిని చేరుకోవడం సాధ్యమేనా? అనేది ఇప్పుడు చూద్దాం..
అందుకే రిటైర్ అవ్వలేదు!
రోహిత్ ముందు 2 భారీ లక్ష్యాలు ఉన్నాయని అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ తెలిపాడు. ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే వరకు హిట్‌మ్యాన్ రిటైర్ అవ్వడని అన్నాడు. అందులో ఒకటి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ నెగ్గడమని.. రెండోటి వన్డే ప్రపంచ కప్ అని రివీల్ చేశాడు. ఈ రెండు మేజర్ టైటిల్స్ నెగ్గాలనేది అతడి టార్గెట్ అన్నాడు దినేష్ లాడ్. రోహిత్ రిటైర్ అవ్వాలని అనుకుంటే టీ20 వరల్డ్ కప్ ముగియగానే అయ్యేవాడని.. ఈ రెండు ట్రోఫీలు గెలవాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టే కేవలం పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ వైఫల్యం బాధేసిందన్న కోచ్.. అతడు మళ్లీ పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అప్పటిదాకా ఆడతాడా?
‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే ప్రపంచ కప్.. ఈ రెండూ రోహిత్ ముందున్న టార్గెట్స్. అవి రీచ్ అయ్యే వరకు విశ్రమించడు. ఆసీస్ సిరీస్‌లో అతడి ఫెయిల్యూర్ గురించి అంతా మాట్లాడుతున్నారు. ఆ టూర్‌లో విఫలమైన సీనియర్లలో రోహిత్ ఒక్కడే ఉన్నాడా? అతడు టెక్నికల్‌గా తోపు ప్లేయర్. డొమెస్టిక్ క్రికెట్‌లో అతడు ఆడాల్సిన అవసరం ఉంది. ఫామ్‌ను మెరుగుపర్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది’ అని రోహిత్ చిన్ననాటి కోచ్ చెప్పుకొచ్చాడు. ఇక, హిట్‌మ్యాన్ కోచ్ చెప్పింది నిజమవ్వాలంటే అతడు మరో రెండున్నరేళ్లు టెస్టులు, వన్డేల్లో కొనసాగాలి. డబ్ల్యూటీసీ నెక్స్ట్ సైకిల్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్.. రెండూ 2027లోనే జరుగుతాయి. మరి.. అప్పటివరకు రోహిత్ ఈ రెండు ఫార్మాట్లలో కంటిన్యూ అవుతాడేమో చూడాలి.