Tilak Varma: ప్లాన్ ప్రకారమే అటాక్.. తిలక్ మామూలోడు కాదు
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:42 PM
India vs England: టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ ప్లాన్స్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అతడి సైలెంట్ స్కెచ్ గురించి తెలిస్తే ఎవ్వరైనా అతడు మామూలోడు కాదు అని అనకమానరు.

IND vs ENG: క్రికెట్‌లో చేజింగ్ అంత ఈజీ కాదు. అందునా కీలక ఆటగాళ్లంతా చేతులెత్తేసిన వేళ క్రీజులో నిలబడాలంటే దమ్ము ఉండాలి. ప్రత్యర్థి బౌలర్ల కళ్లలోకి కళ్లు పెట్టి చూసే ధైర్యం ఉండాలి. చూస్కుందాం అంటూ సవాల్ విసిరే తెగువ ఉండాలి. తాను ఆడటంతో పాటు అవతలి బ్యాటర్ల నుంచి కూడా కావాల్సిన కాంట్రిబ్యూషన్ రాబట్టే తెలివి ఉండాలి. ఇవన్నీ తనలో పుష్కలంగా ఉన్నాయని నిరూపించాడు హైదరాబాదీ తిలక్ వర్మ. ఇంగ్లండ్‌తో చెపాక్ వేదికగా జరిగిన రెండో టీ20లో 55 బంతుల్లో 72 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు తిలక్. పోయిందనుకున్న మ్యాచ్‌లో జట్టును గెలిపించి కొత్త హీరోగా అవతరించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక సైలెంట్ స్కెచ్ ఉందని చాలా మందికి తెలియదు.
యుద్ధం అలా గెలిచాడు!
యుద్ధం గెలవాంటే మొత్తం ప్రత్యర్థి సైన్యాన్ని ఓడించాల్సిన అవసరం లేదు.. అవతలి రాజు లేదా సేనానిని ఓడిస్తే చాలు అని పెద్దలు అంటుంటారు. అదే ఫార్ములాను అమల్లో పెట్టాడు తిలక్ వర్మ. ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ అటాక్‌కు స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ ఆయువుపట్టుగా చెప్పొచ్చు. భీకర వేగం, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్, రాకాసి బౌన్సర్లతో అపోజిషన్ టీమ్‌ను వణికిస్తుంటాడు ఆర్చర్. అతడ్ని ఆడలేక తోపు బ్యాటర్లు తోక ముడిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే అతడి కథ ముగిస్తే చాలు.. ఇంగ్లీష్ టీమ్ ఖేల్ ఖతం అని భావించారు కోచ్ గౌతం గంభీర్-హిట్టర్ తిలక్. ఆర్చర్ బలమైన బౌన్సర్లు, లెంగ్త్ డెలివరీస్‌ను టార్గెట్ చేసి ముందే ప్రిపేర్ అయి బ్యాటింగ్‌కు దిగాడు వర్మ.
పథకం ప్రకారమే..!
ఆర్చర్‌ను ఎలా ఎదుర్కోవాలి? అతడి బౌలింగ్‌లో ఎటు వైపు బిగ్ షాట్స్ కొట్టాలి? ఎలా అటాక్ చేయాలనేది ముందే సన్నద్ధమై వచ్చాడు తిలక్. రెండో టీ20లో ఆ ప్లాన్‌ను అమల్లో పెట్టి అతడి బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సులతో భారీగా పరుగులు పిండుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే రివీల్ చేశాడు. ‘ప్రత్యర్థి జట్టు బెస్ట్ బౌలర్‌ను కావాలనే టార్గెట్ చేశా. ఆర్చర్‌ను బాదితే ఇతర బౌలర్లు ఒత్తిడిలో పడతారని తెలుసు. అందుకే ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో నేను అటాకింగ్ కొనసాగించా’ అని తిలక్ రివీల్ చేశాడు.
వయొలెంట్ ఇన్నింగ్స్!
‘ఆర్చర్ మీద నేను దాడి చేస్తే ఇతర బ్యాటర్లకు పరుగులు చేయడం సులభతరం అవుతుంది. అందుకే కావాలనే అతడ్ని లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు బాదా. రెండో మ్యాచ్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో నేను కొట్టిన అన్ని షాట్లు మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినవే. అతడి బౌలింగ్ తీరుకు ముందే మానసికంగా ప్రిపేర్ అయి వచ్చా. అందుకే రిజల్ట్ అంత బాగా వచ్చింది’ అని తిలక్ చెప్పుకొచ్చాడు. అతడి మాటలు విన్న ఫ్యాన్స్.. ఈ లెఫ్టీ మామూలోడు కాదు అని మెచ్చుకుంటున్నారు. సైలెంట్‌గా ప్లాన్ చేసి వయొలెంట్ ఇన్నింగ్స్ ఆడావని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇదే జోరు కొనసాగించమని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి