ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:40 AM
అవినీతి నిరోధక శాఖ నుంచి ఏ ప్రభుత్వ అధికారికి ఫోన్లు రావని, అలా ఎవరైనా ఏసీబీ పేరు చెప్పి ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరక్టర్ జనరల్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

నకిలీ అధికారులతో జాగ్రత్త: ఏసీబీ డీజీ విజయకుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి16(ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక శాఖ నుంచి ఏ ప్రభుత్వ అధికారికి ఫోన్లు రావని, అలా ఎవరైనా ఏసీబీ పేరు చెప్పి ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరక్టర్ జనరల్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక తహస్దీలార్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తనను తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. తహసీల్దార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కేసు నమోదు కాకుండా చూడాలంటే డబ్బు పంపాలన్నాడు. విషయం తెలిసిన ఏసీబీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
అవినీతి నిరోధక శాఖకు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదులు వస్తే రహస్యంగా విచారణ జరిపి ఆపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, ఇలా ముందస్తు ఫోన్లు చేయడం ఉండదని ఏసీబీ డీజీ వివరించారు. నకిలీ ఏసీబీ అధికారుల గురించి సమాచారం ఇవ్వదలిచిన వారు టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కానీ, వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వదలిస్తే 9440446106కు కానీ తెలియచేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు.