Share News

SLBC Tunnel: బీఆర్‌ఎస్‌ వల్లే టన్నెల్‌ ప్రమాదం!

ABN , Publish Date - Mar 03 , 2025 | 03:44 AM

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం దుర్ఘటనకు కారణం బీఆర్‌ఎస్సేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో టన్నెల్‌ గురించి పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడీ ప్రమాదం జరిగిందన్నారు.

SLBC Tunnel: బీఆర్‌ఎస్‌ వల్లే టన్నెల్‌ ప్రమాదం!

  • పదేళ్లు వాళ్లు పట్టించుకోలేదు

  • ప్రమాదం జరిగాక అబుదాబిలో హరీశ్‌ జల్సాలు

  • ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి నిబద్ధతను నిరూపించుకుంటాం: రేవంత్‌

  • టన్నెల్‌ లోనికెళ్లి సీఎం పరిశీలన

నాగర్‌కర్నూల్‌/మహబూబ్‌నగర్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగం దుర్ఘటనకు కారణం బీఆర్‌ఎస్సేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో టన్నెల్‌ గురించి పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడీ ప్రమాదం జరిగిందన్నారు. విపత్తులు జరిగినప్పుడు రాజకీయాలకతీతంగా ఏకం కావాల్సి ఉండగా.. విపక్షాలు మాత్రం బురద రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్రలు, కుయుక్తులతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నించడం సరికాదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో బాధితుల పరామర్శ కంటే ఎన్నికల ప్రచారానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించిన హరీశ్‌రావు.. టన్నెల్‌ ఘటన జరిగాక రెండు రోజులు అబుదాబిలో జల్సాలు చేసింది వాస్తవం కాదా? అని రే వంత్‌ ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పరిశీలించారు. టన్నెల్‌లో కిలోమీటరు దూరం లోపలికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి ఉంటే నేడు ఈ ప్ర మాదం జరిగేదే కాదన్నారు. నిర్మాణ సంస్థకు బిల్లు లు చెల్లించకపోవడంతో పాటు కరెంటు బిల్లులు కట్టలేదన్న కారణంతో విద్యుత్తు సరఫరాను కూడా నిలిపివేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆర్‌ది కాదా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో తాగునీరు అందించి తీరతామని స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటన ప్రకృతి విపత్తు అన్నారు. దుర్ఘటన గురించి తెలిసిన గంట వ్యవధిలోనే మంత్రులను రంగంలోకి దించి సహాయక చర్యలను ప్రారంభించామని చెప్పారు. టన్నెల్‌లో చి క్కుకున్న 8 మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదని.. ఇందుకు మరో రెండు మూడు రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ప్రమాద ఘటనలో బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.


మీలా నిరంకుశ పోకడలు అవలంబించట్లే..

బీఆర్‌ఎ్‌సలా తమ ప్రభుత్వం నిరంకుశ పోకడలను అవలంబించడం లేదని సీఎం రేవంత్‌ చెప్పా రు. అందుకే బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఎస్‌ఎల్‌బీసీని సందర్శించగలిగారన్నారు. దేవాదుల, కాళేశ్వరం, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు విపక్ష నేతలను గృహనిర్బంధం చేసి, కనీసం బాధితులను పరామర్శించే అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనను కూడా అరెస్టు చేశారన్నారు. తాను ఎస్‌ఎల్‌బీసీని సందర్శించలేదని విమర్శలు చేస్తున్న హరీశ్‌రావు.. ఘటన జరిగిన సమయంలో ఎక్కడున్నారో తెలంగాణ సమాజానికి తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే ఆయన పాస్‌పోర్టు ఎంట్రీలను బయట పెట్టాలని సవాలు విసిరారు. ఎస్‌ఎల్‌బీసీ తవ్వకం పనులు పునఃప్రారంభించే క్రమంలో టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌కు సంబంధించిన విడి భాగాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అమెరికాకు పంపించి తెప్పించామని గుర్తుచేశారు. కన్వేయర్‌ బెల్టును పునరుద్ధరించే ప్రక్రియ సోమవారం రాత్రికి పూర్తవుతుందని.. అది పూర్తయితే మట్టిని బయటకు తరలించే ప్రక్రియ వేగిరం అవుతుందని చెప్పారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీని రాడార్‌ వ్యవస్థ ద్వారా గుర్తించే ప్రక్రియను చేపట్టామని, రెండు రోజుల క్రితం వచ్చిన సమాచారంలో మార్కింగ్‌ చేసిన చోట మానవ అవశేషాలు కనినిపించలేదని తెలిపారు. అవసరమైతే రోబోటిక్‌ టెక్నాలజీతో కార్మికుల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. మంత్రి ఉత్తమ్‌ మాట్లాడు తూ.. అంతర్జాతీయ టెక్నాలజీతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.


ఎంత ఖర్చయినా భరిస్తాం..

ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనకాడబోమన్నారు. టన్నెల్‌ను పరిశీలించిన తర్వాత ఆయన ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తదితర ఏజెన్సీల ముఖ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు టన్నెల్లో వాస్తవ పరిస్థితిని సీఎంకు వివరించారు. సొరంగం లోపల టీబీఎం ఇరుక్కొని ఉందని, దాన్ని పూర్తిస్థాయిలో తొలగించనంత వరకు సహాయక చర్యలు ముమ్మరమయ్యే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు.

Updated Date - Mar 03 , 2025 | 03:45 AM