LRS: ఎల్‌ఆర్‌ఎస్ లక్ష్యం రూ.8,800 కోట్లు
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:29 AM
లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా రూ.8,800 కోట్ల ఆదాయాన్ని పొందాలని అధికారులు అంచనాలు రూపొందించారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 25.68 లక్షల దరఖాస్తుల్లో సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించినా ఈ మొత్తం వస్తుందని లెక్కగట్టారు.

20 లక్షల అర్జీలు పరిష్కారమైతే వచ్చే మొత్తమిది
ఈ నెలాఖరుకు 30ు వరకు అర్జీలు రావొచ్చని
అధికారుల అంచనా.. దాంతో రూ.2 వేల కోట్ల రాబడి
శుక్రవారం అర్ధరాత్రి దాకా వచ్చింది రూ.500 కోట్లే
ఇప్పటిదాకా ఫీజు కట్టిన వారు 1,25,732 మంది
రుసుము చెల్లించినా ప్రొసీడింగ్స్ రావట్లేదని పలువురు దరఖాస్తుదారుల ఆందోళన
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా రూ.8,800 కోట్ల ఆదాయాన్ని పొందాలని అధికారులు అంచనాలు రూపొందించారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 25.68 లక్షల దరఖాస్తుల్లో సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించినా ఈ మొత్తం వస్తుందని లెక్కగట్టారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి గత ఆగస్టులో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ పెద్దగా పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకు 25 శాతం రాయితీ ఇస్తూ, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసి, పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడానికి సర్కారు చర్యలు చేపట్టింది. రాయితీని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఫీజు చెల్లించాలని 20 లక్షల దరఖాస్తులకు ఒకేసారి లేఖలు పంపింది. మొత్తం దరఖాస్తుల్లో నిషేధిత భూముల పరిధిలో 2.50 లక్షల దరఖాస్తులు, జలవనరులకు ఆనుకుని ఉన్న వాటికి సంబంధించి 1.60 లక్షల దరఖాస్తులు, ఇతర సాంకేతిక కారణాలతో మరికొన్ని కలిపి సుమారు 5 లక్షలకు పైగా దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో పెట్టారు. ఫీజు చెల్లించాలని లేఖలు పంపిన 20 లక్షల దరఖాస్తుల్లో 30 శాతం మంది ఈ నెలాఖరులోగా ముందుకు వస్తారని అంచనా వేసిన అధికారులు.. వారి నుంచి సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. గత మూడు వారాల్లో రాయితీ పథకం కింద 1,25,723 మంది ఫీజు చెల్లించగా.. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు రూ.500 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు రోజుల నుంచి దరఖాస్తుదారుల స్పందన బాగుందని, నెలాఖరు నాటికి ఇంకో రూ.1,500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని ఆందోళన..
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినా వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పది రోజుల వ్యవధిలో ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పినా.. కొన్ని ప్రాంతాల్లో ఈ విషయంలో దరఖాస్తుదారులకు తలెత్తుతున్న సందేహాలను క్షేత్ర స్థాయి అధికారులు నివృత్తి చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫీజులు చెల్లించినా ప్రొసీడింగ్స్ ఎందుకు ఇవ్వడం లేదంటూ దరఖాస్తుదారులు మూడు రోజుల క్రితం ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో ఆందోళన చేశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తుండటంతో.. దరఖాస్తుదారులు ఫీజు కట్టాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ విషయంపై డీటీసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడారు. ఫీజు చెల్లించాక క్షేత్ర స్థాయి విచారణ ఉంటే తప్ప ప్రొసీడింగ్స్ ఆపడం లేదన్నారు. ప్రొసీడింగ్స్ విషయంలో ఆందోళన వద్దని.. అందుకు అవసరమైన ఫార్మాట్ సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 30 వేల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చామని తెలిపారు. కాగా, ఎల్‌ఆర్‌ఎస్ వంద శాతం పురోగతి సాధించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులకు సూచించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మునిసిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం కావాలని సూచించారు. ఇదే విషయంపై 24న మరోసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.