Share News

MLC Jeevan Reddy: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్

ABN , Publish Date - Jan 17 , 2025 | 02:07 PM

MLC Jeevan Reddy: బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందని అన్నారు.

MLC Jeevan Reddy: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్
MLC Jeevan Reddy

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌పై విచారణ జరుగుతోందని తనపై వచ్చిన ఆరోపణలను కేటీఆర్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫార్మూలా కేసు రేసు నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడలను కేటీఆర్ చేస్తున్నారని ఆక్షేపించారు. ఇవాళ(శుక్రవారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలిపారు. రైతు భరోసా పేరుతో ఈనెల 26వ తేదీ నుంచి రైతుకు ప్రోత్సహం కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని జీవన్‌రెడ్డి చెప్పారు.


రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద రూ.12 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతు బంధు పేరుతో ఏడాదికి రూ.8వేల నుంచి రూ.10 వేలు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఇస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రూ.14వేలు కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు రూ.500 బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈనెల 26వ తేదీ నుంచి ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ హౌసింగ్ స్కీంను మర్చిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుందని అన్నారు. బీఆర్ఎస్ 2023 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ ఎత్తివేసిందన్నారు. బీజేపీ రుణమాఫీ మాట ఊసే ఎత్తలేదని చెప్పారు. కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తే బాగుండేదని తెలిపారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు.

Updated Date - Jan 17 , 2025 | 02:11 PM