Minister Komatireddy: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం
ABN , Publish Date - Feb 10 , 2025 | 09:10 AM
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు భారీగా క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుణ్యస్నానం ఆచరించారు.

హైదరాబాద్: ప్రయాగరాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా వేలాదిగా పాల్గొంటున్నారు. కాగా, మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు పుణ్యస్నానం చేశారు. వీరేకాక సినీనటులు హేమామాలిని, అనుపమ్ ఖేర్, ఒలింపిక్స్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్, కొరియోగ్రాఫర్ రెమె డిసౌజా తదితర ప్రముఖులు కూడా పుణ్యస్నానం గావించారు.

సంగం ఘాట్‌లో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు..
తాజాగా ఈ పవిత్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడి ఘాట్‌లలో ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు(సోమవారం) ఉదయం 5 గంటల 10 నిమిషాలకు ప్రయాగరాజ్‌లోని సంగం ఘాట్‌లో మంత్రి పుణ్యస్నానం గావించారు. మంత్రి కోమటిరెడ్డి వెంట ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య యాదవ్ ఉన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్‌లో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు మంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి పూజారులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Fire Accident.. పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..
Minister Komatireddy: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం
Dharani Portal: కోడలికి ‘గిఫ్ట్’ ఇవ్వడం కుదరదు!
Read Latest Telangana News and Telugu News