Bandi Sanjay: అలా చేస్తే ఊరుకునేది లేదు.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Feb 13 , 2025 | 10:40 AM
Bandi Sanjay:స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

కరీంనగర్: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వంపై నెట్టాలనుకోవడం రేవంత్ ప్రభుత్వ మూర్ఖత్వమని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది రేవంత్ ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైందన్నారు. కరీంగనర్‌లో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం తథ్యమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుంచి ముస్లింలను తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పుతూ బీసీలను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. బీసీలంతా కాంగ్రెస్ మోసాలను గుర్తించాలని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదని అన్నారు. మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలీదా? అని ప్రశ్నించారు.
15వ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా జాప్యం చేస్తారా అని నిలదీశారు. ఇప్పటికే రెండు దఫాలుగా నిధులు రాలేదని చెప్పారు.73, 74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగడం కాదు.... రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలని హితవు పలికారు. సర్పంచ్ లేకుంటే గ్రామసభలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేదెలా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నా పట్టించుకోరా? అని నిలదీశారు. ఓడిపోతామనే భయంతోనే రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని బండి సంజయ్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News