జోరుగా అక్రమ మట్టి దందా
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:16 AM
ధర్మారంలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచి మొదలుకొని తెల్లవారుజాము వరకు భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి తీయాలంటే ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

ధర్మారం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ధర్మారంలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచి మొదలుకొని తెల్లవారుజాము వరకు భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి తీయాలంటే ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ కోయ శ్రీహర్ష గృహ అవసరాల కోసం నూతన మట్టి పాలసీని గత నెలలో ప్రవేశపెట్టారు. ఈ పాలసీ ప్రకారం గృహ అవసరాలకు మట్టిని తీసుకునే వారు ట్రాక్టర్‌కు రూ.2 వందలు, టిప్పర్‌కు రూ.8 వందలు కలెక్టర్ పెద్దపల్లి, తహసీల్దార్‌కు డీడీ తీయాల్సి ఉంటుంది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి రుసుం చెల్లించినా కేవలం పని దినాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మట్టి తరలించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పట్టించుకోకుండా మట్టి మాఫియా అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తోంది. మట్టి తొలగిస్తున్న క్రమంలో అడ్డువచ్చిన చెట్లను తొలగిస్తూ పచ్చదనానికి తూట్లు పొడుస్తున్నారు.
పట్టించుకొని అధికారులు ్ఠ
కొన్ని నెలలుగా అక్రమంగా మట్టి దందా జోరుగా కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలవు రోజుల్లో అధికారాలు లేని సమయాల్లో మట్టి మాఫియా చెలరేగి పోతుంది. పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తీసే సమయంలో చెట్లను తొలగిస్తున్నా అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇందుకోసం ఫోన్‌లో మైనింగ్ అధికారులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
అనుమతి తీసుకోలేదు
ఎం.డీ వఖీల్, తహసీల్దార్
గృహ అవసరాల కోసం దాదాపు వంద ట్రాక్టర్ల వరకు అనుమతి తీసుకున్నారు. టిప్పర్లలో మట్టి తరలింపు కోసం ఎవ్వరు అనుమతి తీసుకోలేదు. ప్రభుత్వానికి రుసుము చెల్లించకుండా మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటాం.
మానేరు వాగులో మట్టి తవ్వకాలు
ఓదెల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రూపునారాయణపేట శివారులోని మానేరు వాగులో రెండు రోజుల నుంచి కొందరు వ్యక్తులు జోరుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇన్నాళ్లుగా ఇసుకను తోడేయగా ఇప్పుడు మట్టిని వదలడం లేదు. ఇసుక కింద ఉన్న మట్టిని తవ్వుకెళ్లి గొయ్యిలలో నింపుతున్న తీరు ఇక్కడి మానేరు వాగులో నయా దందాకు తెరలేపారు. ముందుగా టిప్పర్లు రాకపోకలు సాగించే విధంగా వాగులోని అనువైన ప్రాంతాన్ని చూసి ఇసుకను తవ్వి కుప్పలుగా పోస్తున్నారు. అడుగు బాగం నుంచి మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. మట్టి తవ్వకాలను చేపట్టేందుకు మానేరులో మట్టితో రోడ్డు కూడా వేశారు. రెండు రోజుల నుంచి మట్టి దందా కొనసాగుతున్నప్పటికీ ఏ అధికారి కూడా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై, అక్రమ దారుల్లో మట్టి తవ్వకాలను చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.